Sukanya Samriddhi Yojana : కేవలం రూ.411తో.. సుకన్య యోజనలో రూ.72 లక్షలు ఎలా పొందాలి?
Sukanya Samriddhi Yojana : ప్రతి తల్లిదండ్రికీ తమ కూతురి భవిష్యత్తు సురక్షితంగా ఉండాలని, ఆర్థికంగా ఆమె ఎవరిపైనా ఆధారపడకూడదని కల ఉంటుంది. భారతదేశంలో అమ్మాయిల భవిష్యత్తు కోసం అనేక పెట్టుబడి పథకాలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సుకన్య సమృద్ధి యోజన అత్యంత నమ్మదగిన, ఆకర్షణీయమైన పథకంగా నిలిచింది. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలలో ఒకటైన ఇది, మీ పెట్టుబడికి భద్రత ఇవ్వడంతో పాటు, ఇతర పథకాల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తుంది. ప్రస్తుతం అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికానికి గాను 8.2% వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అధిక వడ్డీ రేటుతో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ద్వారా మీ కుమార్తెకు 21 ఏళ్లు నిండేసరికి దాదాపు రూ.72 లక్షల భారీ మొత్తాన్ని అందించవచ్చు. రోజుకు రూ.411 చొప్పున పెట్టుబడి పెడితే ఈ మొత్తం ఎలా తయారవుతుందో పూర్తి లెక్కను తెలుసుకుందాం.
లక్షలు లేదా కోట్లు కూడబెట్టాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అనుకుంటారు. కానీ సుకన్య సమృద్ధి యోజనలో కాంపోండింగ్ మాయాజాలం పనిచేస్తుంది. ఈ పథకంలో మీరు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే డబ్బు డిపాజిట్ చేయాలి.. అయితే ఈ పథకం 21 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. అంటే చివరి ఆరు సంవత్సరాలు మీరు ఒక్క రూపాయి కూడా జమ చేయకపోయినా మీ మొత్తంపై వడ్డీ లభిస్తూనే ఉంటుంది. ఈ రూ.72 లక్షల లెక్కను పరిశీలిస్తే రోజుకు రూ.411 చొప్పున (వార్షికంగా రూ.1,50,000) 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మీ జేబు నుంచి మొత్తం రూ.22,50,000 జమ అవుతుంది. ప్రస్తుత 8.2% వడ్డీ రేటు (వార్షిక కాంపోండింగ్) ప్రకారం.. 21 ఏళ్ల తర్వాత వడ్డీ రూపంలో దాదాపు రూ.49,32,119 లభిస్తుంది. ఈ విధంగా మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ.71,82,119 (సుమారు రూ.72 లక్షలు) అవుతుంది. ఈ భారీ మొత్తం మీ కూతురి ఉన్నత విద్య లేదా పెళ్లి ఖర్చులకు పటిష్టమైన ఆర్థిక ఆధారాన్ని అందిస్తుంది.
బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారంలో భాగంగా ప్రారంభించిన ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ హామీతో నడుస్తుంది కాబట్టి ఇందులో మార్కెట్ రిస్క్ ఉండదు. ఈ పథకం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ఓపెన్ అయ్యాయి. ఇందులో రూ.3.25 లక్షల కోట్లకు పైగా మొత్తం జమ అయిందని ప్రధాని మోదీ ఇటీవల తెలిపారు. ప్రస్తుతం 8.2% వడ్డీ రేటు అమలులో ఉంది. ఇది ఇతర చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే అత్యధిక వడ్డీ రేట్లలో ఒకటి. ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే కాదు పన్ను ఆదా చేసుకోవడానికి కూడా ఒక అద్భుతమైన మార్గం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, ఈ పథకంలో సంవత్సరానికి జమ చేసే గరిష్ట మొత్తం (రూ.1.5 లక్షల వరకు)పై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, ఈ పన్ను ప్రయోజనం పాత పన్ను విధానం ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకంలో అతిపెద్ద ఆకర్షణ దాని EEE(Exempt-Exempt-Exempt) మోడల్. అంటే, మీరు జమ చేసిన మొత్తం, సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీపై వచ్చే మొత్తం పూర్తిగా పన్ను రహితం అవుతాయి.
ఈ పథకం చాలా సరళంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలిక పేరు మీద ఆమె తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు. మీరు కేవలం రూ.250 తో ఖాతా తెరవవచ్చు. మీ సౌలభ్యాన్ని బట్టి రూ.50 గుణకాల్లో మొత్తాన్ని పెంచుకోవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 జమ చేయడం తప్పనిసరి, లేదంటే ఖాతా డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.