SC: సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు

నేడు వజ్రోత్సవాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.... అగ్రాసనాన్ని అధిష్టించిన ఇద్దరు తెలుగువాళ్లు

Update: 2024-01-28 01:30 GMT

భారత సుప్రీంకోర్టు 75వ పడిలోకి అడుగు పెట్టింది. వజ్రోత్సవం వేళ ఎన్నో చారిత్రాత్మక తీర్పులతో దేశ గౌరవాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం మరింత పెంచింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటంలో కీలక భూమిక పోషిస్తున్న ఈ న్యాయస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రావడంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 28 నుంచి సుప్రీంకోర్టు మనుగడలోకి వచ్చింది. సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులకు దేశంలోని అన్ని కోర్టులూ కట్టుబడి ఉండాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకొనే నిర్ణయాలను సమీక్షించి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని కొట్టివేసే అధికారం ఈ కోర్టుకు దక్కింది.


1950 జనవరి 28 ఉదయం 9.45 గంటలకు న్యాయమూర్తులు తొలిసారి సమావేశమవడంతో దాన్నే సుప్రీంకోర్టు అధికారిక ప్రారంభంగా గుర్తించారు. ప్రస్తుత కోర్టు నడుస్తున్న భవనం అందుబాటులోకి వచ్చేంతవరకూ పాత పార్లమెంటు భవనంలోని ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌లో సుప్రీంకోర్టు కొనసాగింది. తొలినాళ్లలో కోర్టు ఏడాదికి 28 రోజులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే సమావేశమయ్యేది. కాలగమనంలో ఏడాదికి 190 రోజులు పనిచేసే స్థాయికి చేరుకొంది. తొలినాళ్లలో న్యాయమూర్తుల సంఖ్య 8 ఉండగా.. అది ఇప్పుడు 34కు చేరింది. ప్రస్తుతం ఢిల్లీలోని తిలక్‌మార్గ్‌లో ఉన్న సుప్రీంకోర్టు భవనం 17 ఎకరాల త్రికోణాకార స్థలంలో నిర్మితమైంది. 1954 అక్టోబరు 29న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరో నాలుగేళ్లకు 1958 ఆగస్టు 4న ఆయనే దీన్ని ప్రారంభిస్తూ న్యాయ దేవాలయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు చిహ్నంగా సారనాథ్‌లోని అశోకుడి స్తూపం నుంచి ధర్మచక్రాన్ని స్వీకరించారు. ఈ చిహ్నం కింద న్యాయం ఎక్కడుంటే విజయం అక్కడే అని సూచిస్తూ ‘యతో ధర్మస్తతో జయః’ అనే సంస్కృత సూక్తి ఉంటుంది.

ఇద్దరు తెలుగువాళ్లు


వజ్రోత్సవాలు జరుపుకొంటున్న భారత అత్యున్నత న్యాయస్థానం అగ్రాసనాన్ని ఇప్పటివరకు ఇద్దరు తెలుగు ప్రముఖులు అధిష్ఠించారు. 75 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటివరకు 49 మంది ప్రధాన న్యాయమూర్తులు, 191 మంది న్యాయమూర్తులు సేవలందించారు. పదవీ విరమణ పొందిన ప్రధాన న్యాయమూర్తుల్లో ఇద్దరు, న్యాయమూర్తుల్లో 12 మంది తెలుగువారున్నారు. 1958 జనవరి 31 నుంచి 1967 ఏప్రిల్‌ 11 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ కోకా సుబ్బారావు 1966 జూన్‌ 30 నుంచి 9వ ప్రధాన న్యాయమూర్తిగా 9 నెలలు సేవలందించారు. ఈయన తన పదవీ విరమణకు నాలుగు నెలల ముందే న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి దిగారు. ఆ తర్వాత 54 ఏళ్లకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ 48వ ప్రధాన న్యాయమూర్తిగా 2021 ఏప్రిల్‌ 24న బాధ్యతలు చేపట్టి 16 నెలలు ఆ పదవిలో కొనసాగారు.

Tags:    

Similar News