Supreme Court: పంజాబ్‌-హైకోర్టు జడ్జిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యాయమూర్తి అనుచిత వ్యాఖ్యల్ని తొలగిస్తున్నట్లు వెల్లడి;

Update: 2024-08-08 01:45 GMT

కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టిన పంజాబ్‌-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమని, కోర్టు గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొన్నది.

వ్యాజ్యాల విచారణ సమయంలో న్యాయమూర్తులు సంయమనం పాటిస్తూ, బాధ్యతాయుతంగా మెలగాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. కోర్టుల కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్న పరిస్థితుల్లో ఏదైనా అంశంపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించింది. కోర్టు ధిక్కరణ కేసులో పంజాబ్, హరియాణా హైకోర్టుకు చెందిన ఏకసభ్య ధర్మాసనం సర్వోన్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ వ్యాఖ్యలపై బుధవారం సుమోటోగా విచారణ జరిపింది. హైకోర్టు జడ్జి జస్టిస్‌ రాజ్‌బీర్‌ సహరావత్‌ చేసిన వ్యాఖ్యలు అప్రతిష్ఠాకరం, అనుచితమని స్పష్టం చేస్తూ వాటిని తొలగిస్తున్నట్లు తెలిపింది.

ప్రత్యేక ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌ సభ్యులుగా ఉన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన హైకోర్టు జడ్జిపై ఎలాంటి చర్యలకు ఆదేశించలేదు. ఇప్పటికే ఆ జడ్జి వ్యాఖ్యలతో కూడిన ఉత్తర్వుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ నిలుపుదల (స్టే) ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. గత మే నెల 29న కోర్టు ధిక్కరణ కేసుపై విచారణ జరిపిన జస్టిస్‌ రాజ్‌బీర్‌ సహరావత్‌ వివాదంలో ఉన్న ఆస్తిని హరియాణా ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. దీనిపై ఏ కోర్టూ అపీల్‌ను స్వీకరించరాదని, విచారణ జరపరాదని పేర్కొన్నారు.

ఈ తీర్పుపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఆదేశాలిచ్చింది. దీనిపై మండిపడిన జస్టిస్‌ రాజ్‌బీర్‌ సహరావత్‌.. ఆ ఆదేశాలు చెల్లవని పేర్కొనడంతో పాటు జులై 17న వెలువరించిన ఆదేశాల్లో పరిధిని మించిన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో బహిర్గతమైంది. ‘‘కోర్టు తీర్పు పట్ల నష్టపోయిన వ్యక్తులు అసంతృప్తికి గురికావచ్చు. కానీ, ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలపై న్యాయమూర్తులు ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేరు’’ అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News