BR Gavai: వీధి కుక్కలపై సుప్రీం తీర్పు.. పరిశీలిస్తానన్న చీఫ్ జస్టిస్ గవాయ్
వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో గవాయ్ నుంచి ఈ ప్రకటన;
ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీర్పు ఉత్తర్వులను తాను పరిశీలిస్తానని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
వీధి కుక్కల దాడుల వల్ల దిల్లీ, ఎన్సీఆర్‌ల పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం.. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.లో ఎక్కడా వీధి కుక్కలు ఉండటానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని.. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది.
సుప్రీంతీర్పుపై జంతు హక్కుల సంస్థలు ఆక్షేపణ తెలిపాయి. కేంద్ర మాజీమంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అభ్యంతరం తెలిపారు. తీర్పు ఆచరణ సాధ్యం కాదన్నారు. ‘‘ఢిల్లీలో 3 లక్షల వీధికుక్కలు ఉన్నాయి. వీటికోసం 3 వేల షెల్టర్లు కావాలి. వీటి ఏర్పాటుకు రూ.15 వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో ఢిల్లీ ప్రభుత్వం ఉందా?’’ అని ప్రశ్నించారు. ఈ తీర్పు దశాబ్దాలుగా మనం అనుసరిస్తూ వచ్చిన మానవీయ, సైన్స్ ఆధారిత విధానాల నుంచి వెనకడుగు వేసినట్లుగా ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘వీధి కుక్కలన్నింటినీ గంపగుత్తగా తొలగించాలన్న నిర్ణయం క్రూరమైనది’’ అని అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ, ప్రముఖ సినీనటులు జాన్ అబ్రహాం, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ ఆనంద్, అడివి శేష్ తదితరులు వీధి కుక్కల సంరక్షణపై స్పందించారు.
ఈ అంశంపై చీఫ్ జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్పును పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో గవాయ్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. బుధవారం ఉదయం ఈ అంశాన్ని గవాయ్ దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలిస్తామంటూ హామీ ఇచ్చారు.