Supreme Court: అత్యాచార బాధితురాలి గర్భవిచ్చితిపై సుప్రీం కీలక తీర్పు

గుజరాత్‌ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసహనం... అసలు అక్కడ ఏం జరుగుతుందని ప్రశ్న....

Update: 2023-08-22 03:30 GMT

అత్యాచార బాధితురాలు గర్భవతి కావడంపై సుప్రీంకోర్టు( Supreme Court ) కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి కాకముందే అవాంఛనీయ ఘటనల కారణంగా ఓ స్త్రీ గర్భవతి కావడం బాధితురాలికి కోలుకోలేని గాయమని వ్యాఖ్యానించింది. వివాహ వ్యవస్థ ద్వారా గర్భవతి అయితే అది ఆమెతో పాటు ఆ కుటుంబంలోనూ పండగ వాతావరణం తెస్తుందని.. అలా అత్యాచారం ద్వారా కలిగితే బాధిత మహిళ శారీరకంగా, మానసికంగా కుంగిపోతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మహిళపై జరిగే లైంగికదాడే భరించరానిదని, గర్భం ధరిస్తే అది మరింత గాయంగా మారుతుందని, ఇలాంటి సందర్భాల్లో గర్భస్రావానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం( Justices B.V. Nagarathna and Ujjal Bhuyan Bench) వ్యాఖ్యానించింది.

సామూహిక అత్యాచారానికి గురైన మహిళ గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌(abortion case)ను సుప్రీంకోర్టు విచారించింది. బాధిత మహిళ 27వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు కోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా బాధిత మహిళ కేసులో గుజరాత్‌ హైకోర్టు వ్యవహరించిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది‍(Supreme Court criticises Gujarat High). సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన రూలింగ్‌లకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఏ ఇతర కోర్టులకు కూడా లేదని స్పష్టం చేసింది. అలా చేస్తే అధి రాజ్యాంగ ధర్మానికే విరుద్ధమవుతుందని తెలిపింది. ఓ కేసు సుప్రీంకోర్టులో తమ దగ్గర విచారణలో ఉండగా హైకోర్టులో ఉత్తర్వులు ఇవ్వడం తగదని ధర్మాసనం పేర్కొంది. గుజరాత్‌ హైకోర్టులో బాధిత మహిళ పిటిషన్‌ వేయగా అత్యవసరంగా విచారణ జరపాల్సిన కేసును 12 రోజుల పాటు వాయిదా వేసింది. గర్భం 27 వారాలది కావడం, విచ్ఛిత్తికి సమయం మించిపోతుందన్న కారణంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే గర్భస్రావానికి అనుమతి లేదంటూ గుజరాత్‌ హైకోర్టు శనివారమే ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల వివరాలను విచారణ ప్రారంభించిన ధర్మాసనం దృష్టికి న్యాయవాదులు తీసుకువచ్చారు. దీనిపై గుజరాత్‌ హైకోర్టులో అసలు ఏం జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కింది కోర్టులు కాదనలేవని తెలిపింది. గుజరాత్‌ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా(Solicitor-General Tushar Mehta) సమాధానం ఇస్తూ అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల రాతలో తప్పు దొర్లడంతో దాన్ని సరిదిద్దడానికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. 

Tags:    

Similar News