Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు షాక్

ఇక అభిశంసనకు గురయ్యే ప్రమాదం;

Update: 2025-08-07 06:00 GMT

జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. త్రిసభ్య కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీ వేసింది. వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన విషయం వాస్తవమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ నివేదికను సవాల్ వేస్తూ పిటిషన్ వేస్తే తాజాగా న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఆయనకు మరిన్ని కష్టాలు వెంటాడనున్నాయి. యశ్వంత్‌ వర్మ అభిశంసనకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే అభిశంసన తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది. అదే గనుక జరిగితే స్వతంత్ర భారతదేశంలో పదవి నుంచి తొలగించబడిన మొదటి హైకోర్టు న్యాయమూర్తిగా వర్మ రికార్డుల్లోకి ఎక్కుతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 ప్రకారం ప్రస్తుతం పార్లమెంటు దర్యాప్తు చేస్తుంది.

మార్చి 14న జస్టిస్ యశ్వంత వర్మ నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 11:43 గంటలకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెల్లాచెదురుగా పడి ఉన్న నగదును గుర్తించారు. అనంతరం ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగదు వీడియోలను రికార్డ్ చేసి ఢిల్లీ పోలీసులు.. సీనియర్ అధికారులకు పంచారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తికి సమాచారం అందించారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నా విచారణకు ఆదేశించారు. దాదాపు రూ.15 కోట్ల వరకు నగదు ఉంటుందని సమాచారం. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. కానీ ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ప్రస్తుతం దీన్నే వర్మ సవాల్ చేశారు. ఈ కేసులో న్యాయ సూత్రాలను పాటించలేదని.. తనను పూర్తిస్థాయిలో విచారించకుండానే సుప్రీంకోర్టు మాజీ సీజేఐ సంజీవ్‌ఖన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విచారణ కమిటీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇక విచారణ కమిటీ కూడా సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కమిటీ ఇచ్చిన నివేదికను చెల్లనదిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. కానీ చివరికి సుప్రీం ధర్మాసనం.. వర్మ వాదనలను తోసిపుచ్చి కొట్టేసింది.

Tags:    

Similar News