Supreme Court : బుల్డోజర్ న్యాయంపై సుప్రీం ఆగ్రహం

Update: 2024-09-19 06:45 GMT

బుల్డోజర్ న్యాయంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ల ఇళ్లు, ప్రయివేటు ఆస్తులపైకి బుల్డోజర్లను నడిపించే విషయంలో బాధితులకు ఉపశమనం ఇవ్వడం, దేశస్థాయిలో మార్గదర్శకాల తయారీపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వాదనలు విన్నది. అనధికారంగా జరిపే ఇటువంటి బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1వ తేదీ వరకు నిలిపివేయాలని పేర్కొంది.

మరోవైపు వీటిని ఆపితే ఆక్రమణల తొలగింపు ఆలస్యం అవుతుందన్న ప్రభుత్వం భయాలను సుప్రీం తోసిపుచ్చింది. వచ్చే విచారణ తేదీ వరకు కూల్చివేత చర్యలు ఆపినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు. మిన్ను విరిగి మీద పడదు. అని జస్టిస్ విశ్వనాథ్ వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాలు చేపట్టిన బుల్డోజర్ చర్యలపై ఇప్పటికే వేర్వేరు సందర్భాలలో సుప్రీం కోర్టు అసహనం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను హీరోయిజంగా చూపే ప్రయత్నం చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్ముకాశ్మీర్, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కూల్చివేతలపై ఈసీకి నోటీసులు ఇస్తామని చెప్పింది. ఈ రాష్ట్రాల్లో చాలాచోట్ల బీజేపీ అధికారంలో ఉంది.

అదే సమయంలో బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపు విషయంలో మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని తేల్చిచెప్పింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, సీయూ సింగ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో జమాత్ ఉలేమా హింద్ ప్రధాన పిటిషనర్ వ్యవహరిస్తోంది.

Tags:    

Similar News