Street dogs: వీధి కుక్క కాటుకు.. భారీ జరిమానా: రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక
అంత ప్రేమ ఉంటే ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని సూచన
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్న పిల్లలు, వృద్ధులపై వీధి కుక్కలు దాడిచేసి గాయపరిస్తే.. వాటికి తిండి పెడుతున్న వారిదే బాధ్యత అని స్పష్టం చేసింది. వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని సూచించింది. వీధి కుక్కల విషయంలో తమ ఆదేశాలను పాటించని రాష్ట్ర ప్రభుత్వాలపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గాయపడ్డ వారికి పరిహారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని స్పష్టం చేసింది. చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు తాము నిర్దేశించిన పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్ నాథ్ హెచ్చరించారు.
‘‘ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే.. అప్పుడు ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఆ ప్రాణనష్టానికి సదరు సంస్థ బాధ్యత వహించదా? వీధి కుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలి. లేదంటే ప్రతి కుక్క కాటుకు, కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి గానూ ఆయా రాష్ట్రాలపై మేం నిర్దేశించిన భారీ పరిహారాలను చెల్లించాలి’’ అని న్యాయస్థానం (SC on Stray Dog Attacks) స్పష్టం చేసింది.
ఇక, వీధికుక్కలకు ఆహారం పెట్టే వారి గురించి మాట్లాడుతూ.. ‘‘మీకు శునకాలపై అంత ప్రేమ ఉంటే.. వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి. వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశమని అంటున్నారు. మీ భావోద్వేగం కేవలం కుక్కల పైన మాత్రమేనా? మేం మనుషుల గురించి కూడా సమానంగా ఆందోళన చెందుతున్నాం. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని మేం ఆమోదించబోం’’ అని ధర్మాసనం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబరులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలోని వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.