Supreme Court: 8వ తరగతి పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’పై పాఠం- సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
అవమానిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక
8వ తరగతి పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశం చేర్చడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం పద్ధతి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక సంస్థను అవమానిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
NCERT 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే కంటెంట్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దృష్టికి సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తీసుకొచ్చారు. సుమోటో కాగ్నిజెన్స్ చేయాలని కోరారు. పాఠశాల విద్యార్థులకు ఇలాంటి పాఠాలు నేర్పించడం ద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని.. ఇది చాలా విచారకరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠ్యాంశం తీరుపై న్యాయవాదులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.
ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని తాను గమనించానని చెప్పారు. సంస్థను కించపరుస్తామంటే ఎవరినీ అనుమతించబోమని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇప్పటికే ఈ అంశంపై అనేక ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చాయని గుర్తుచేశారు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసు అన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదేదో ప్రణాళికబద్ధంగా.. ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకంటే తాను ఏమీ చెప్పదలచుకోలేదన్నారు. ఏదేమైనా ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తదుపరి చర్యలకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం సూచించింది.
చాలా కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి..
‘‘ఈ పాఠం విషయం తెల్సి నాకు బార్ నుంచి బెంచ్‌దాకా పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదుల నుంచి నాకు అనేక ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. అవినీతి అనేది ఒక్క న్యాయవ్యవస్థలోనే ఉందా? ఇంకా ఏ వ్యవస్థలోనూ లేదా?. ఇటువంటి బోధనల వలన చిన్నారుల్లో న్యాయవ్యవస్థపై గౌరవం పోతుంది’’ అని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సూమోటోగా వెంటనే స్వీకరించాలని సిబల్ కోరగా సీజేఐ ‘‘ఈ ఒక్కరోజు ఆగండి.
ఈ విషయంలో యావత్ న్యాయవ్యవస్థ ఆందోళన వ్యక్తంచేస్తోంది. న్యాయవ్యవస్థలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తమ అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈసమస్యను ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసని, ఈవ్యవహారంపై ఇప్పటికే సూమోటాగా కేసును నమోదుచేయాలని ఆదేశించా’’అని సీజేఐ తెలిపారు. ‘‘ఉద్దేశపూర్వకంగా పా ఠ్యాంశాన్ని చేర్చినట్లుగా ఉంది. పక్కా ప్రణాళికతో, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇంతకుమించి మేం వ్యాఖ్యానించబోం. ఏదేమైనా ఇలాంటి కీలక అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా’’అని లాయర్లతో సీజేఐ అన్నారు.
మేము చాలా బాధపడ్డాం
‘‘న్యాయవ్యవస్థను అవమానక రీతిలో చిత్రించిన కొత్త పాఠ్యాంశాన్ని చూసి మేం చాలా కలత చెందాం’’అని న్యాయవాదులు సింఘ్వీ, సిబల్ ధర్మాసనం ఎదుట చెప్పారు. ‘‘న్యాయవ్యవస్థలో అవి నీతి ఉందంటూ విద్యార్థులకు బోధించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం’’అని సిబల్ అన్నారు. ‘‘పాఠ్యపుస్తకంలోని అంశాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సూ త్రాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’అని జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ ఆందోళన వ్యక్తం చేశారు. సీజేఐ వ్యాఖ్యలను కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ స్వాగతించారు.
యూటర్న్ తీసుకున్న ఎన్‌సీఈఆర్‌టీ
సర్వోన్నత న్యాయస్థానం సహా పలు హైకోర్టుల జడ్జీలు, న్యాయవాదులు, పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎన్‌సీఈఆర్‌టీ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. తమ వెబ్‌సైట్ నుంచి వివాదాస్పద పాఠ్యపుస్తకాన్ని తొలగించింది. వివాదాస్పద అంశాలను తొలగించాలని భావిస్తోంది. ఇప్పటికే పుస్తకాల ముద్రణ పూర్తయినప్పటికీ వాటిని తొలగించి మళ్లీ కొత్తగా ముద్రించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పాఠ్యాంశాన్ని బోధించాలా వద్దా అనే విషయంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఢిల్లీలోని పలు పాఠశాలల యాజమాన్యాలు బుధవారం వెల్లడించాయి.
ఈ పాఠ్యాంశాన్ని రచించిన విషయ నిపుణులను రప్పించి అసలు వీటికి తుది అనుమతులు ఇచ్చిందెవరు అనేది తేల్చేందుకు ఎన్‌సీఈఆర్‌టీ అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎన్‌సీఈఆర్‌టీ చైర్మన్ దినేశ్ ప్రసాద్ సాక్లానీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. పాఠ్యాంశంపై మోదీ సర్కార్ సైతం అసంతృప్తిగా ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సుప్రీంకోర్టులో సుమారు 81 వేలు, హైకోర్టుల్లో 62.40 లక్షలు, జిల్లా, సబార్డినేట్ కోర్టులో ఏకంగా 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, న్యాయవ్యవస్థలో అవినీతి మేటవేసిందని, జడ్జి పోస్టుల భర్తీ సవ్యంగా జరగకపోవడంతో సమస్యలను ఎదుర్కొంటోందని ఆ పాఠ్యాంశంలో పొందుపరిచిన విషయం విదితమే.