Supreme Court : పతంజలి ఆయుర్వేద`పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మోసపూరిత ప్రకటనలు ఆపాలంటూ వార్నింగ్;
మోసపూరిత ప్రకటనలు ఆపాలని లేదంటే భారీ జరిమానా తప్పదు అంటూ పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మంగళవారం (నవంబర్ 21,2023)న జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద కంపెనీ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
ఆధునిక వైద్య విధానాన్ని, అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ పతంజలి ఆయుర్వేద చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పతంజలి పేర్కొన్న అంశాలు వెరిఫై కాలేదని, ఇవి డ్రగ్స్, రెమెడీస్ చట్టం 1954, వినియోగదారుల రక్షణ చట్టం వంటి పలు చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఐఏఎం పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లతో కూడిన అన్ని ప్రకటనలనూ వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇలాంటి ఉల్లంఘనను న్యాయస్థానం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని కూడా హెచ్చరించింది. ఈ ప్రకటనలను తక్షణమే ఆపకపోతే ప్రతి తప్పుడు క్లెయిమ్‌కి గరిష్టంగా కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ఈ సమస్యపై న్యాయస్థానం కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆచరణాత్మక పరిష్కారాన్ని చూడాలని భారత అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌ని ధర్మాసనం కోరింది. దీనిని ’అల్లోపతి వర్సెస్ ఆయుర్వేద’ అనే చర్చగా మార్చకూడదని, తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు నిజమైన పరిష్కారాన్ని కనుగొనాలని బెంచ్ కేంద్రాన్ని కోరింది. తదుపరి విచారణను 2024 ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. గతేడాది కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ.. అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చినందుకు బాబా రాందేవ్‌ను న్యాయస్థానం మందలించింది.