Tamil Nadu : కళ్లకురిచి కల్తీ మద్యం.. 61కి చేరిన మృతుల సంఖ్య
చికిత్స పొందుతున్న 88మంది;
తమిళనాడులోని కళ్లకురిచ్చి ప్రాంతంలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 61కి చేరింది. జూన్ 18న కరుణాపురం గ్రామంలో కల్తీ మద్యం తాగిన వారిలో 118 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాగా, ఈ దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణాత్మక నివేదిక కోరింది.మరోవైపు ఈ కల్తీ సారా ఘటనలో ఆరుగురు మహిళలు కూడా మరణించడంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని సభ్యురాలైన ఖుష్బు సుందర్ ఇవాళ బాధిత కుటుంబాలతోపాటు చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించనున్నారు.
మొత్తం 225 మంది కల్తీ మద్యం తాగి వివిధ ఆసుపత్రులలో చేరారు. అందులో 61 మంది చనిపోయారు. 47 మంది తమిళనాడులోని కళ్లకురిచి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 63 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ కాగా, 32 మంది ఆసుపత్రిలో మరణించారు. మొత్తం 20 మందిని పుదుచ్చేరిలోని జిప్మర్ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో 6 మంది డిశ్చార్జ్ కాగా, 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 5 మంది మరణించారు. 52 మందిని స్లామ్ మెడికల్ కాలేజీలో చేర్చారు. అందులో మొత్తం 22 మంది చనిపోయారు. 29 మంది చికిత్స పొందుతున్నారు. ఒకరు చికిత్స తర్వాత ఈ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కల్తీ మద్యం తాగి ఆరోగ్యం క్షీణించడంతో మొత్తం 8 మందిని విల్లుపురం మెడికల్ కాలేజీలో చేర్పించారు. వీరిలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు చికిత్స పొందుతుండగా, ఇద్దరు చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు.
ఇదిలా ఉంటే, కల్తీ మందు విషాదంపై రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏఐఏడీఎంకే, బీజేపీ ఈ ఘటనపై డీఎంకే సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. కళ్లకురిచి ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని ఏఐఏడీఎంకే నిరసనలు చేపట్టింది. కళ్లకురిచి మద్యం దుర్ఘటనపై తమిళనాడు అధికార డీఎంకే, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో ఇండియా కూటమి మౌనంగా ఉంది. ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు ఇలాంటి దుర్ఘటనల నివారణకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును 10 రోజుల సమయం కోరింది. నివేదికను దాఖలు చేసేందుకు స్టాలిన్ ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు జూలై 3 వరకు గడువు ఇచ్చింది.