DMK: సీఏఏ, జమిలి ఎన్నికలు రద్దు..డీఎంకే మేనిఫెస్టో పూర్తి వివరాలివే
డీఎంకే సంచలన హామీలు
తమిళనాడులో అధికార డీఎంకే.. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చింది. నీట్ పరీక్ష, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటిని తమిళనాడులో అమలు చేయబోమని తేల్చి చెప్పింది. 21 మంది లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేసిన డీఎంకే 18 స్థానాలను కాంగ్రెస్ సహా.. ఇతర మిత్రపక్షాలకు కేటాయించింది.
తమిళనాడులో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గవర్నర్ల నియామకానికి సంబంధించి ఇతర రాష్ట్రాలను సంప్రదించి చర్చలు జరుపుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలన్న స్టాలిన్ అలా చేసే వరకు గవర్నర్ల నియామకం సీఎంలతో సంప్రదించిన తర్వాతే జరగాలన్నారు. క్రిమినల్ విచారణల నుంచి మినహాయింపు కల్పించే ఆర్టికల్ 361కు సవరణలు చేసేలా పోరాడతామని మేనిఫెస్టోలో వెల్లడించారు. జాతీయ విద్యావిధానాన్ని, నీట్ పరీక్ష, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ చట్టాలను తమిళనాడులో అమలు చేయబోమని తేల్చి చెప్పారు. తిరుకురల్‌ను జాతీయ పుస్తకంగా ప్రకటించేలా చేస్తామన్నారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదాను తొలగించే అధికారాన్ని కేంద్రానికి కల్పించే ఆర్టికల్ 356 రద్దుపై పోరాడుతామని వివరించారు. మోదీ ప్రభుత్వం.. దేశాన్ని నాశనం చేసిందన్న స్టాలిన్,. ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
మేనిఫెస్టోతో పాటు 21 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ డీఎంకే జాబితా విడుదల చేసింది. సిట్టింగ్ ఎంపీలైన కనిమొళి తూత్తుక్కుడి నుంచి, శ్రీపెరంబదూర్ నుంచి టీఆర్ బాలు, నీలగిరి నుంచి ఎ రాజాకు మరోసారి అభ్యర్థిత్వం ఖరారు చేసింది.
మిత్రపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే తదితర పార్టీలకు 18 సీట్లు కేటాయించింది. కాంగ్రెస్ 9 స్థానాల్లో బరిలోకి దిగనుంది. కళానిధి వీరసామి నార్త్ చెన్నై, తమిళచి తంగపాండియన్ సౌత్ చెన్నై, దయానిధి మారన్ మధ్య చెన్నై, అన్నాదురై తిరువన్నామలై నుంచి పోటీ చేయనున్నారు. 2019లో డీఎంకే నేతృత్వంలోని కూటమి తమిళనాడులోని 39 స్థానాలకు గాను 38 స్థానాల్లో విజయం సాధించింది. పోటీ చేసిన 9 స్థానాల్లో కాంగ్రెస్ ఎనిమిదింటిని కైవసం చేసుకుంది.డీఎంకే ప్రకటించిన 21 మంది అభ్యర్థుల్లో 11 మంది కొత్తవారే ఉన్నారు.