Bangladesh: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిఖ్‌ రహ్మాన్‌ ప్రమాణం

భారత్‌ తరఫున ఓం బిర్లా హాజరు

Update: 2026-02-17 23:29 GMT

బంగ్లాదేశ్‌ కొత్త ప్రధానిగా బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ(బీఎన్‌పీ) అధినేత తారిఖ్‌ రహ్మాన్‌ మంగళవారం ప్రమాణం చేశారు. దశాబ్దాల పాటు షేక్‌ హసీనా, ఖలేదా జియాల ఆధిపత్యంలో బంగ్లాదేశ్‌ రాజకీయాలు సాగగా మొదటిసారి ఎన్నికల్లో ఓ కొత్త వ్యక్తి పోటీచేసి ప్రధానిగా ప్రమాణం చేయడం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖలీదా జియా కుమారుడైన తారిఖ్‌ రహ్మాన్‌ 17 ఏండ్ల ప్రవాస జీవితాన్ని ముగించుకుని గత ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగిరావడమే గాక తన తల్లి మరణానంతరం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఎన్నికల్లో పార్టీని విజయ తీరానికి చేర్చారు.

ఢాకాలోని జాతీయ సంగ్సద్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహ్మద్‌ జర్దారీ బీఎన్‌పీ చైర్మన్‌ రహ్మాన్‌ చేత ప్రమాణం చేయించారు. భారతదేశ ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి హాజరుకావడం హసీనా ప్రవాసంతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గే సూచనలు కనపడుతున్నాయి. అంతకుముందు బీఎన్‌పీ పార్లమెంటరీ పార్టీ పార్లమెంట్‌ భవనంలో సమావేశమై తమ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రహ్మాన్‌ను ఎన్నుకుంది. తారిఖ్‌ రహ్మాన్‌ గడిచిన 35 ఏండ్లలో బంగ్లాదేశ్‌ తొలి పురుష ప్రధాని.

భారత్‌పై యూనస్‌ అక్కసు

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, మైనారిటీల రక్షణలో విఫలమై స్వదేశంలో నిరంతర విమర్శలు ఎదుర్కొన్న బంగ్లాదేశ్‌ ప్రధాన సలహాదారు మహ్మద్‌ యూనస్‌ తన వీడ్కోలు ప్రసంగంలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఈశాన్య రాష్ర్టాలైన సెవెనె సిస్టర్స్‌ను మరోసారి ప్రస్తావించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ‘విశాల సముద్రం మా దేశానికి భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడానికి అదో మార్గం. నేపాల్‌, భూటాన్‌, సెవెన్‌ సిస్టర్స్‌తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యం కలిగి ఉంది’ అని అన్నారు.

Tags:    

Similar News