IT Rides : కాంగ్రెస్ ఎంపీ బంధువుల కంపెనీల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు
మరో 19 బ్యాగుల్లో నగదు స్వాధీనం;
జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడింది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్‌లలో ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రాంచీలోని ధీరజ్ సాహూకు చెందిన ఆఫీసులో మరో మూడు బ్యాగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ ప్రాంతాల్లోని మద్యం ఫ్యాక్టరీల నిర్వహణ ఇన్‌ఛార్జీ బంటీ సాహు ఇంట్లో దాదాపు 19 బ్యాగుల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో దాడులు కొనసాగుతున్నాయి.
బంటీ సాహు ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 20 కోట్లు పైగా ఉందని, స్వాధీనం చేసుకున్న డబ్బును ఒడిశా బలంగీర్‌లోని సుద్పారాలోని బ్యాంకులకు తరలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తాము రెండు రోజుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం డబ్బును లెక్కిస్తామని పేర్కొన్నారు. 50 మంది ఉద్యోగులు డబ్బులను లెక్కించడంలో పాల్గొంటున్నారని తెలిపారు. త్వరలో డబ్బు లెక్కింపుకు చేరాలని మరింత మందిని ఆహ్వానించామని భారతీయ స్టేట్ బ్యాంక్ బోలంగీర్ రీజినల్ మేనేజర్ భగత్ బెహెరియా చెప్పారు. స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని లెక్కపెట్టేందుకు అధికారులు మూడు డజన్ల కౌంటింగ్ మెషీన్లను వాడుతున్నారు. ఇప్పటి వరకూ దాదాపుగా రూ.300 కోట్ల మేర సొమ్మును పట్టుబడినట్లు సమాచారం. కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మొదట డిసెంబర్ 6న డిస్టిలరీలపై దాడులు చేపట్టారు. ఆ తర్వాత బల్దియో సాహు గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోనూ తనిఖీలు చేపట్టారు. అక్కడ 156 బ్యాగుల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని టిట్లాగఢ్, సంబల్పూర్, సుందర్‌గఢ్, భువనేశ్వర్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రూర్కెలా, రాయగడలో కొందరు మద్యం వ్యాపారులకు సంబంధించిన ఆస్తులపై కూడా సోదాలు జరిగాయి.