JANASENA: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు
జనసేన 13వ ఆవిర్భావ సంబరాలు... గిరిజనుల మధ్య జరుపుకోవాలని నిర్ణయం... స్వయంగా పాల్గొననున్న పవన్ కల్యాణ్...నేడు గిరిజన గ్రామంలో జనసేన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జనసేన పార్టీకి మార్చి 14 ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజునే పార్టీ స్థాపన జరిగినందున ప్రతి సంవత్సరం జనసేన శ్రేణులు ఈ రోజును పండుగలా జరుపుకుంటాయి. అయితే ఈసారి ఆ వేడుకల నిర్వహణలో పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ప్రత్యేక చర్చకు దారితీసింది. సాధారణంగా భారీ సభలు, భారీగా అభిమానుల సమూహంతో నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈసారి భిన్నంగా జరపాలని ఆయన నిర్ణయించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల మధ్య ఈ వేడుకలను నిర్వహిస్తూ వారితో మమేకం కావాలని నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈసారి గిరిజన గ్రామంలో నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు అనే గిరిజన గ్రామాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో ఆయన స్వయంగా పాల్గొననున్నారు. మొదటగా ఓనూరు జంక్షన్ వద్ద జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాధారణంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భారీ స్థాయిలో జరుగుతుంటాయి. అయితే ఈసారి అలాంటి భారీ సభలకు బదులుగా గిరిజనులతో కలిసే కార్యక్రమాన్ని ఎంచుకోవడం ఆయన రాజకీయ ధోరణిని మరోసారి ప్రతిబింబిస్తోంది.
గిరిజనుల మధ్యే...
జెండా ఆవిష్కరణ అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్) పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఈ పథకాల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎంతవరకు సక్రమంగా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు స్వయంగా పరిశీలన చేయాలని నిర్ణయించారు. పీఎం జన్ మన్ పథకం నిధులతో ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని పవన్ కళ్యాణ్ కాలి నడకన పరిశీలించనున్నారు. అడవిలో నిర్మించిన ఈ రహదారి పనులను ఆయన నడుస్తూ పరిశీలిస్తూ నాణ్యతా ప్రమాణాలను జనసేన నేతలు తనిఖీ చేయనున్నారు.
ఈ ప్రయాణంలో మార్గమధ్యంలో గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను కూడా ఆయన తెలుసుకునే అవకాశం ఉంది. అనంతరం “అడవితల్లి బాట” కార్యక్రమం ద్వారా పూర్తయిన రోడ్లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు తెలియజేయడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నందిగరువు గ్రామానికి చేరుకున్న తర్వాత గ్రామ ప్రజలతో నిర్వహించే “మాటా-మంతీ” కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో గిరిజనులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, అభ్యర్థనలను తెలుసుకునే అవకాశం ఉంది.
గిరిజనులతో సహపంక్తి భోజనం
అంతేకాకుండా గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. గ్రామ ప్రజలతో కలిసి భోజనం చేయడం ద్వారా వారితో మరింత సన్నిహితంగా మమేకం కావాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రాజకీయ నాయకులు భారీ సభల్లో ప్రసంగాలు చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ప్రజల మధ్య నేరుగా వెళ్లి వారితో మాట్లాడటాన్ని ప్రాధాన్యంగా తీసుకోవడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో నిర్వహించాలని ముందుగా నిర్ణయించిన రాష్ట్రస్థాయి వేడుకలను పార్టీ రద్దు చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా పెద్ద సభ నిర్వహించడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు.