Mental Health: స్వీయ నిర్బంధం విధించుకున్న టెకీ!
కుటుంబ సభ్యుల మరణంతో మూడేళ్లుగా ఒంటరి జీవితం;
ఒకప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా పనిచేసిన వ్యక్తి... కుటుంబంలో జరిగిన వరుస విషాదాలతో మానసికంగా కుంగిపోయాడు. ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని ఏకంగా మూడేళ్లపాటు తన ఫ్లాట్‌కే పరిమితమయ్యాడు. చుట్టూ పేరుకుపోయిన చెత్త, విరిగిన ఫర్నిచర్, దుమ్ము ధూళి మధ్య దయనీయ స్థితిలో జీవిస్తున్న అతడిని సామాజిక కార్యకర్తలు గుర్తించి రక్షించారు. హృదయాలను కలచివేసే ఈ ఘటన నవీ ముంబైలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... నవీ ముంబైలోని జూయినగర్‌లో ఉన్న ఘర్‌కూల్ సొసైటీలో 55 ఏళ్ల అనుప్ కుమార్ నాయర్ నివసిస్తున్నారు. ఆరేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోవడం, రెండు దశాబ్దాల క్రితం సోదరుడు ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు ఆయనను తీవ్రమైన డిప్రెషన్‌లోకి నెట్టాయి. ఈ క్రమంలో 2022 నుంచి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంచుకున్నారు. కేవలం ఫుడ్ డెలివరీ సిబ్బందికి తప్ప మరెవరికీ తన ఫ్లాట్ తలుపులు తెరిచేవారు కాదు.
చెత్త దిబ్బగా మారిన ఇల్లు
అనుప్ ఇంటి నుంచి చెత్త బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పలుమార్లు ఆయన్ను హెచ్చరించారు. అయినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అపార్ట్‌మెంట్‌లోని ఒక నివాసి 'సోషల్ అండ్ ఇవాంజెలికల్ అసోసియేషన్ ఫర్ లవ్' (సీల్) అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సీల్ కార్యకర్తలు అనుప్ ఫ్లాట్‌కు చేరుకుని, ఎట్టకేలకు ఆయనను ఒప్పించి తలుపులు తెరిపించారు. లోపల దృశ్యాలు చూసి వారు నిర్ఘాంతపోయారు. ఇల్లంతా ఆహార ప్యాకెట్లు, చెత్త గుట్టలుగా పేరుకుపోయి ఉంది. ఫర్నిచర్ విరిగిపోయి, దుమ్ముతో నిండిపోయింది.
దయనీయ స్థితిలో అనుప్
సామాజిక కార్యకర్తలు చూసేసరికి అనుప్ కుమార్ నాయర్ జుట్టు పెరిగిపోయి, చిక్కులు పట్టి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఆయన కాళ్లకు ఇన్ఫెక్షన్ సోకి చర్మం నల్లగా మారిపోయింది. ఇంట్లోని మంచం పూర్తిగా పాడవ్వడంతో హాల్‌లోని ఓ కుర్చీపైనే నిద్రించేవారని తెలిసింది. గతంలో ఆయన కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా పనిచేశారు. ఆయన తల్లి భారత వైమానిక దళంలోని టెలికమ్యూనికేషన్స్ విభాగంలో, తండ్రి ముంబైలోని టాటా ఆసుపత్రిలో ఉద్యోగాలు చేసేవారని సమాచారం. బంధువులు కొందరు సాయం చేసేందుకు ప్రయత్నించినా ఆయన వారితో మాట్లాడేందుకు ఇష్టపడలేదు.
వెంటనే స్పందించిన సీల్ సిబ్బంది, అనుప్‌ను పన్వేల్‌లోని తమ ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఒకప్పుడు ఉన్నత వృత్తిలో రాణించిన వ్యక్తి, మానసిక వేదనతో ఇలాంటి దుర్భర స్థితికి చేరడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.