Roller coaster: 70 అడుగుల ఎత్తులో ఆగిపోయిన రోలర్ కోస్టర్,
మూడుగంటల తర్వాత క్రేన్ సహాయంతో రక్షించిన అగ్నిమాపక శాఖ అధికారులు;
తమిళనాడులోని చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న విజీపీ అమ్యూజ్‌మెంట్ పార్క్ లో రోలర్ కోస్టర్ నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఎనిమిది మంది పిల్లలు, పది మంది మహిళలు సహా ముప్పై మంది దాదాపు మూడు గంటల పాటు 70 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. మూడు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు పర్యాటకులు. పైకి వెళ్ళిన రోలర్ తిరిగి కిందకు వచ్చే సమయంలో సాంకేతికత లోపం కారణంగా ఆగిపోయింది. రోలర్ గాల్లోనే కిందకు రాకుండా ఆగిపోవడంతో భయంతో ఆపరేటర్లు పరార్ అయ్యారు. భయంతో చిన్నపిల్లల తల్లిదండ్రులు నరకయాతన అనుభవించారు.
రోలర్ కోస్టర్ పనిచేయకపోవడంతో, పార్క్ సిబ్బంది వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించారు. అగ్నిమాపక, రెస్క్యూ సేవల బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. డెబ్బై ఆడుగులపైన చిక్కుకున్న వారిని మూడుగంటల తర్వాత క్రేన్ సహాయంతో అగ్నిమాపక శాఖ అధికారులు రక్షించారు. చిక్కుకుపోయిన వారిని ఒక్కొక్కరిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆపరేటర్ సహా యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.