Bihar Elections 2025: అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి రూ.30,000..

'మాయ్ బహిన్ మాన్ యోజన' కింద ఆర్థిక సాయం

Update: 2025-11-04 06:15 GMT

బీహార్‌లో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకున్న వేళ ప్రతిపక్ష ఆర్జేడీ నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మహిళల కోసం భారీ హామీని ప్రకటించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ఏటా రూ.30,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరిలో ఒకేసారి వారి ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.

తొలి దశ పోలింగ్‌కు రెండు రోజుల ముందు పాట్నాలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజస్వి యాదవ్ ఈ ప్రకటన చేశారు. అధికార ఎన్డీయే కూటమి ఇప్పటికే 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' కింద కోటి మందికి పైగా మహిళల ఖాతాల్లో రూ.10,000 జమ చేసింది. దీనికి పోటీగా, తేజస్వి తమ 'మాయ్ బహిన్ మాన్ యోజన' పథకాన్ని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినాన ఈ రూ.30,000 మొత్తాన్ని ఒకే విడతలో అందిస్తామని ఆయన వివరించారు.

"నేను చాలా ప్రాంతాల్లో పర్యటించి అక్కాచెల్లెళ్లతో మాట్లాడాను. మా పథకం పట్ల వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది తమకు ఆర్థిక న్యాయం చేకూరుస్తుందని వారు భావిస్తున్నారు. అందుకే వారి డిమాండ్ మేరకు నెలనెలా కాకుండా ఒకేసారి ఈ మొత్తాన్ని అందించాలని నిర్ణయించాం" అని తేజస్వి పేర్కొన్నారు. వాస్తవానికి, గత వారం విడుదల చేసిన మేనిఫెస్టోలో నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని ఆర్జేడీ ప్రకటించింది.

ఇదే సమయంలో రైతులు, ఉద్యోగులకూ పలు హామీలు ఇచ్చారు. వరికి కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.300, గోధుమకు రూ.400 బోనస్ ఇస్తామన్నారు. ఉపాధ్యాయులు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాకు 70 కిలోమీటర్ల పరిధిలోనే బదిలీలు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) తిరిగి అమలు చేస్తామని కూడా తేజస్వి పునరుద్ఘాటించారు. బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags:    

Similar News