Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..
10 మంది నక్సల్స్ మృతి;
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భద్రతా దళాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గత 15 రోజుల వ్యవధిలో మావోయిస్టులకు ఇది రెండో ఎదురుదెబ్బ. తాజా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌లోని టేక్‌మేటా-కాకుర్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో నారాయణ్‌పూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ నేతృత్వంలో జిల్లా రిజర్వు గార్డు(డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలో పెద్దసంఖ్యలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరువర్గాల మధ్య గంటకు పైగానే భీకర పోరు జరిగినట్లు తెలుస్తున్నది. ఘటనా స్థలిలో భారీ ఎత్తున ఆయుధాలు లభించాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మరికొంత మంది నక్సలైట్లు మృతిచెందే అవకాశం ఉంది. మరోవైపు.. నారాయణపూర్ సమీప ప్రాంతాల్లోనూ పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల జేసీబీ మెషిన్‌తో నేలను తవ్వి
బంకర్‌లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఘటనా స్థలంలో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు, రేషన్, కంప్యూటర్ సెటప్, మందులు, జేసీబీ యంత్రం లభ్యమయ్యాయి.నాలుగు నెలల వ్యవధిలో బస్తర్ రీజియన్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 91 మంది మావోయిస్టులు మృతిచెందారని అధికారిక వర్గాలు తెలిపాయి. తాజా ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ మాట్లాడుతూ నక్సలైట్లు ప్రభుత్వంతో చర్చలకు రావాలని, హింసను వీడాలని కోరారు.