బలవంతపు మతమార్పిడులపై రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చ జరిపి ఆమోదించాలని భజన్లాల్ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తున్నది. గతేడాది ఈ ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇందులో పలు నిబంధనలు పొందుపరిచారు. ఎవరైనా మత మార్పిడి సిద్ధపడితే ఆ విషయాన్ని రెండు నెలల ముందుగా జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలి. మతమార్పిడి తమ సొంతనిర్ణయమని, ఎవరి ఒత్తిళ్లు లేవని కలెక్టర్ ఎదుట అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మతమార్పిడికి అనుమతి లభిస్తుంది. అలా కాకుండా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే మాత్రం రెండు నుంచి పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.25 వేలు జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఈ బిల్లు పెడుతున్నట్లు రాజస్థాన్ మంత్రి కేకే బిష్ణోయ్ తెలిపారు.