జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న వేళ ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది. జమ్మూలోని అతిపెద్ద ఆర్మీ స్థావరం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సుంజ్వాన్ ఆర్మీ బేస్‌కు సీల్ వేసి.. యాంటీ- టెర్రర్ ఆపరేషన్ ప్రారంభించారు.సైనిక స్థావరం వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ బృందాలు కూడా రంగంలోకి దిగి ఈ ఆపరేషన్‌కు సహకరిస్తున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో సెంట్రీ డ్యూటీలో ఉన్న ఓ జవాన్ గాయపడినట్లు భదత్ర బలగాలు తెలిపాయి. టెర్రరిస్టుల కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు 18న తొలి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల వేళ ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇప్పటికే నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గతవారం కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి జరిపిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు.