Delhi : ఢిల్లీ ఉగ్ర కుట్ర భగ్నం... వాంటెడ్ టెర్రరిస్ట్​ను పట్టుకున్న పోలీసులు

Update: 2024-08-09 12:15 GMT

స్వాతంత్ర్య వేడుకల వేళ ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పరారీలో ఉన్నఐసిస్‌ ఉగ్రవాదిని పట్టుకున్నారు. అతడి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని దర్యాగంజ్‌ నివాసి అయిన రిజ్వాన్‌ అబ్దుల్‌ హజీ అలీ ఐసిస్‌ పుణె మాడ్యూల్‌లో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. అతడిపై ఇప్పటికే ఎన్ఐఏ రూ.3లక్షల రివార్డ్‌ కూడా ప్రకటించింది. గురువారం రాత్రి 11 గంటలకు తుగ్లకాబాద్‌లోని బయోడైవర్సిటీ పార్క్‌ వద్దకు రిజ్వాన్‌ అలీ వస్తాడని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అత్యంత చాకచక్యంగా అతడిని ట్రాప్‌ చేసి పట్టుకున్నారు.

అలీ నుంచి పిస్టోల్‌, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేసి.. వాటిల్లోని డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్ర్య వేడుకల వేళ ఢిల్లీకి అతడు రావడం కలకలం రేపింది. ఇప్పటికే ఢిల్లీలోని పలు వీఐపీ ప్రాంతాల్లో రిజ్వాన్‌, అతడి అనుచరులు పలుమార్లు రెక్కీ చేసినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. పంద్రాగస్టు వేళ వీరు ఉగ్రదాడులకు కుట్రలు పన్నినట్లు అనుమానిస్తున్నారు. ఈ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Tags:    

Similar News