Terrorist Attack: రాజౌరీలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
రంగంలోకి దిగిన ఆర్మీ.. సెర్చ్ ఆపరేషన్ కోసం భారీగా భద్రతా బలగాలు..;
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. భారత సైన్యంపై వరుగా దాడులకు పాల్పడుతున్నారు. సోమవారం ఉదయం రాజౌరీ జిల్లా గుంధ్వఖవాస్ ప్రాంతంలో సెక్యూరిటీ పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. అయితే ఉగ్ర దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా ఉగ్రవాదుల ఏరివేత కోసం భారీస్థాయిలో ఆపరేషన్ చెపట్టింది. అయితే టెర్రరిస్టుల కాల్పుల్లో ఓ జవాన్ గాయపడ్డారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను సమీక్షించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.
కాగా, రాజౌరీలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు ప్లాన్ చేసిన భారీ స్థాయి దాడిని సైన్యం తిప్పుకొట్టిందని సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ భర్త్‌వాల్ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ దాడి సోమవారం ఉదయం 4 గంటలకు జరిగినట్లు వెల్లడించారు.
ఈ నెల 19న కశ్మీర్‌లోని కెరన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఇక గత గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో దోడా జిల్లాలో జడ్డన్ బాటా గ్రామంలోని తాత్కాలిక సైనిక క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెలలో కథువా జిల్లాలోని మచేడీ అటవీ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. మరో ఐదుగురు గాయపడ్డారు. అయితే, జమ్మూ కాశ్మీర్‌లోని శాంతియుత ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతాను సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం ఇక్కడ పర్యటించారు. జూన్ 30న భారత ఆర్మీ 30వ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్మీ చీఫ్ జమ్మూలో పర్యటించారు. ఇక, 2005లో ఉగ్రవాదుల నుంచి విముక్తి పొందిన దోడా జిల్లాలో జూన్ 12 నుంచి వరుసగా ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. అలాగే, ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూ ప్రావిన్స్‌లోని ఆరు జిల్లాల్లో జరిగిన సుమారు 12 ఉగ్రవాద దాడుల్లో 11 మంది భారత సైనికులు, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మరణించారు.