Thailand: కాంబోడియాతో ఉన్న సరిహద్దు వద్ద మార్షల్ లా విధించిన థాయిలాండ్..
భారతీయ పర్యాటకులకు అడ్వైజరీ;
కాంబోడియాతో వరుసగా రెండో రోజులు ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో థాయిలాండ్ శుక్రవారం 8 సరిహద్దు ప్రాంతాల్లో మార్టియల్ లా విధించింది. తూర్పు ప్రాంతాలలోని సైనిక సరిహద్దు రక్షణ కమాండ్ కమాండర్ అపిచార్ట్ సప్ప్రసర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్షల్ లా చాంతబురి జిల్లాలో 7 ప్రాంతాలు, ట్రాట్ జిల్లాలోని ఒక ప్రాంతంలో ఉంటుంది.
దాడుల్లో ఇప్పటికే దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. థాయిలాండ్‌లో 1,38,000 మందికి పైగా వ్యక్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు వివాదం తారస్థాయికి చేరింది. థాయిలాండ్ తాత్కాలిక ప్రధాన మంత్రి ఫుమ్థమ్ వెచయాచాయ్ ప్రస్తుత పరిస్థితులు యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇవాళ సరిహద్దు వద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాంబోడియా ఓడ్డార్ మీంచీ ప్రావిన్స్‌లో 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. థాయిలాండ్ ఆరోగ్య శాఖ ప్రకారం 14 మంది పౌరులు, ఒక సైనికుడు మృతి చెందారు. మొత్తం 46 మంది గాయపడ్డారు, ఇందులో 15 మంది సైనికులు ఉన్నారు.
గురువారం ఘర్షణలు ఆరు ముఖ్యమైన ప్రాంతాల వద్ద చోటు చేసుకున్నాయి. పురాతన దేవాలయాల సమీపంలో ఈ ఘర్షణలు కొనసాగాయి. కాంబోడియా బలగాలు థాయిలాండ్ భూభాగంలోకి రాకెట్లు, షెల్స్ వదిలాయి. కాంబోడియా సైనిక స్థావరాలపై యుద్ధవిమానాలతో దాడులు చేసి థాయిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది.
ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్‌లోని భారత రాయబారి కార్యాలయం ఇవాళ అడ్వైజరీ జారీ చేసింది. కాంబోడియా సరిహద్దు ప్రాంతాలకు భారతీయులు వెళ్లకూడదని హెచ్చరించింది. థాయ్ అధికారుల సూచనలు పాటించాలని, టూరిజం అథారిటీ అప్‌డేట్స్‌ను ఫాలో కావాలని సూచించింది.