Pm Modi: ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

72 మందితో క్యాబినెట్‌;

Update: 2024-06-10 00:45 GMT

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి  ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రులుగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు ఎంపీలు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు కూడా హాజరయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 30 మందికి క్యాబినెట్‌ మంత్రులుగా అవకాశం లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఐదేండ్ల తర్వాత మరోసారి క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. గత మంత్రివర్గంలో కీలక శాఖ బాధ్యతలు నిర్వర్తించిన రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌ తదితరులు మరోసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

రాజ్యసభ సభ్యులుగా ఉండి గత మంత్రివర్గంలో కొనసాగిన పీయూష్‌ గోయల్‌, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్‌, భూపేందర్‌ యాదవ్‌ ఈసారి లోక్‌సభ సభ్యులుగా మంత్రివర్గంలో చేరారు. కాగా, జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలిచారు. తెలంగాణ నుంచి కిషన్‌ రెడ్డికి మరోసారి మంత్రిగా అవకాశం లభించింది. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను సహాయ మంత్రిగా తీసుకున్నారు.

మోదీ గత క్యాబినెట్‌లో 10 మంది మహిళలు ఉండగా ఈసారి మాత్రం ఏడుగురికే అవకాశం లభించింది. కేంద్ర మంత్రులుగా నిర్మలా సీతారామన్‌, అన్నపూర్ణ దేవీ, సహాయ మంత్రులుగా శోభ కరంద్లాజే, రక్ష ఖడ్సే, సావిత్రీ ఠాకూర్‌, నిముబెన్‌ బంభానియా, అనుప్రియా పటేల్‌ ప్రమాణస్వీకారం చేశారు. మాజీ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మాజీ సహాయ మంత్రులు డాక్టర్‌ భారతి పవార్‌, సాధ్వీ నిరంజన్‌ జ్యోతి, దర్శన జర్దోశ్‌, మీనాక్షి లేఖి, ప్రతిమా భౌమిక్‌కు ఈసారి అవకాశం దొరకలేదు.

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒంటరిగా మెజారిటీ దక్కని నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలపై బీజేపీ ఆధారపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో కూడా ఈసారి మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇచ్చింది. గత క్యాబినెట్‌లో ఒక్కరికి కూడా కేంద్ర మంత్రిగా అవకాశం దక్కలేదు. కేవలం సహాయ మంత్రి పదవులను మాత్రమే బీజేపీ ఇచ్చింది. ఈసారి మాత్రం 30 మంది క్యాబినెట్‌ మంత్రుల్లో ఐదుగురిని మిత్రపక్షాల నుంచి తీసుకున్నారు. జేడీఎస్‌, హెచ్‌ఏఎం(సెక్యులర్‌), జేడీయూ, టీడీపీ, ఎల్‌జేపీ(రామ్‌విలాస్‌) పార్టీల నుంచి ఒక్కొక్కరిని మంత్రులుగా అవకాశం కల్పించారు. స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా శివసేన నుంచి ఒకరికి, ఆర్‌ఎల్‌డీ నుంచి ఒకరికి చోటిచ్చారు. సహాయ మంత్రులుగా ఆర్పీఐ, అప్నాదల్‌(ఎస్‌), టీడీపీ, జేడీయూ, వీఐపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున అవకాశం ఇచ్చారు. 

Tags:    

Similar News