Char Dham Yatra 2025: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

కురిసిన పుష్పవర్షం..!;

Update: 2025-05-04 04:38 GMT

చార్‌ధామ్‌ యాత్రలో కీలకమైన బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు రవి పుష్య లగ్నంలో ద్వారాలను తెరిచారు. ద్వారా తెరిచిన వెంటనే జై బద్రీ విశాల్‌ నినాదాలతో బద్రీనాథ్‌ ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా హెలికాప్టర్‌పై నుంచి భక్తులపై పుష్పవర్షం కురిపించారు. బద్రీనాథ్ తలుపులు తెరిచిన వెంటనే గత ఆరు నెలలుగా వెలుగుతున్న అఖండ జ్యోతిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు ధామ్ చేరుకున్నారు. దాదాపు పదివేల మందికిపైగా బద్రీనాథ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ ధామి బద్రినాథ్‌ చేరుకున్నారు.

ఆలయ తలుపులు తెరిచిన తర్వాత స్వామివారిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు. వేసవి సందర్భంగా ఆలయ ద్వారాలను తెరిచిన సందర్భంగా.. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దాదాపు 40 క్వింటాళ్ల బంతిపువ్వులతో అందంగా తీర్చిదిద్దారు. ఛార్‌దామ్‌ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారా శుక్రవారం ఉదయం 7 గంటలకు తెరుచుకున్నాయి. అంతకు ముందు అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారా తెరుచుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

ఈ యాత్రకు పోలీసులు, భద్రతా బలగాలు భారీ బందోబస్తును కల్పించాయి. అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులు అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది బద్రీనాథ్‌ యాత్రలో ప్లాస్టిక్‌ వినియోగించకుండా చూడాలని చమోలి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. బద్రీనాథ్‌ థామ్‌, యాత్ర హాల్టులు ఉన్న హోటల్స్‌, ధాబా నిర్వాహకులకు పాలిథిన్‌ కవర్ల వాడకాన్ని తగ్గించాలని జిల్లా కలెక్టర్‌ సందీప్‌ తివారి ఆదేశాలు జారీ చేశారు. కర్ణప్రయాగ్, గౌచర్, నందప్రయాగ్, పిపాల్కోటి, జ్యోతిర్మథ్, గోవిందాఘా‌ట్‌, పాండుకేశ్వర్‌లో ఉన్న హోటళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా హోటల్‌ ఎదుట తప్పనిసరిగా రేట్ల జాబితా బోర్డులు ఉండేలా చూడాలని సూచించారు.

Tags:    

Similar News