MP Mahua Moitra: మహువా మెయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేసిన లోక్‌సభ స్పీకర్
మహువాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ విపక్షాల డిమాండ్;
పార్లమెంట్‌లోప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఈ వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని..కమిటీ చేసిన తీర్మానాన్ని సభ అంగీకరించింది. ఫలితంగా.. ఆమె ఇక ఎంపీగా కొనసాగడం తగదని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ MP మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సుపై సభలో వాడీవేడి చర్చ జరిగింది. మొదట ఎథిక్స్ కమిటీ నివేదికను ఛైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ మొదట మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడింది.
సభ తిరిగి సమావేశమైన తర్వాత ఎథిక్స్ కమిటీ నివేదికపై వాడీవేడి చర్చ జరిగింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే మహువాను బహిష్కరించాలని సిఫార్సు చేశారని లోక్‌సభలో తృణమూల్ పక్ష నేత సుదీప్ బంధోపాధ్యాయ అన్నారు. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆమె గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై మహువా మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని..... తృణమూల్ సభ్యులు డిమాండ్ చేశారు.
పార్లమెంటు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇతరులకు ఇవ్వడం సహా వారి నుంచి బహుమతులు స్వీకరించారని ఎథిక్స్ కమిటీ విచారణలో తేలిందని భాజపా సభ్యులతోపాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి.... ప్రహ్లాద్ జోషీ అన్నారు. మహువా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేయగా.......సభాపతి తోసిపుచ్చారు. అయితే మొయిత్రాకు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే అవకాశం కల్పించలేమని మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గతంలో ఈ అంశం గురించి సోమనాథ్ చట్టర్జీ క్లియర్ చెప్పినట్లు గుర్తు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ .. కమిటీ ముందు చెప్పుకోవాలి, కానీ సభలో కాదు అని అన్నారు. మహువా మొయిత్రా వాదనలను వినాలన్న డిమాండ్‌ను స్పీకర్ ఓం బిర్లా కూడా నిరాకరించారు. 2005లోనూ అప్పటి సభాపతి సోమ్‌నాథ్ ఛటర్జీ ఆరోపణలు ఎదుర్కొన్న సభ్యులకు అవకాశం ఇవ్వలేదన్నారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే తృణమూల్ ఎంపీని బహిష్కరించాలనే తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రవేశపెట్టగా... మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. మహువా బహిష్కరణకు నిరసనగా.... విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం లోక్‌సభ సోమవారానికి వాయిదాపడింది.