Sikkim : సిక్కింలో ఎస్‌కేఎం ప్రభంజనం,32 స్థానాలకుగానూ 31 కైవసం
అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి జయకేతనం
సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 32 సీట్లలో ఆ పార్టీ 31 స్థానాలను గెలుచుకోగా, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒకటి గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 16 సీట్లు అవసరం. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ రెనాక్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికలలో విజయం సాధించారు.ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష సిక్కిం డెమాక్రటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్) కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన పవన్ కుమార్ చామ్లింగ్ రెండుచోట్ల ఓటమి చెం దారు. ఇక జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. ఐదేండ్ల తన పాలన ద్వారా ప్రజామోదం పొందిన ప్రస్తుత సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ మరోసారి అధికారం చేపట్టనున్నారు.
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలపై సిక్కిం క్రాంతికారి మోర్చా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. 2019 ఎన్నికల్లో 25 ఏండ్ల ఎస్‌డీఎఫ్ పాలనకు తెరదించి ఎస్‌కేఎం మొదటిసారి అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 58.38 శాతం ఓట్లను సాధించి ఏకంగా 31 సీట్లు గెలుచుకొని దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసేసింది. ఇక, 2019 ఎన్నికల్లో 15 సీట్లు సాధించి స్వల్ప తేడాతో అధికారం కోల్పోయిన సిక్కిం డెమాక్రటిక్ ఫ్రంట్ ఈసారి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నది. ఆ పార్టీ దాదాపు 20 శాతం ఓట్లను కోల్పోయి 27.37 శాతం ఓట్లతో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ష్యారీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్‌డీఎఫ్ అభ్యర్థి టెంజింగ్ నోర్బు లమ్తా మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
మరోసారి అధికారం చేపట్టనున్న 56 ఏండ్ల ప్రేమ్ సింగ్ తమాంగ్(పీఎస్ గోలే) సిక్కిం ప్రజల్లో మంచి ఆదరణను పొందారు. రాజకీయాల్లోకి రాకముందు మూడేండ్లు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన ప్రేమ్ సింగ్.. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994 నుంచి 2009 వరకు ఆయన మంత్రిగా పని చేశారు. ఎస్‌డీఎఫ్‌లో ఆయన చామ్లింగ్‌కు శిష్యుడిగా కొనసాగారు. 2009 తర్వాత ఆయనకు పవన్ కుమార్ చామ్లింగ్‌తో విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఎస్‌డీఎఫ్ నుంచి బయటకు వచ్చి 2013లో సొంతంగా సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల నాటికి 17 సీట్లు సాధించి 25 ఏండ్ల ఎస్‌డీఎఫ్ పాలనకు ముగింపు పలికి రికార్డు సృష్టించారు భైచంగ్ భూటియాకు తప్పని ఓటమి భారత ఫుట్‌బాల్ దిగ్గజం భైచంగ్ భూటియాకు ఈ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. బర్ఫంగ్ నుంచి ఆయన సిక్కిం డెమాక్రటిక్ ఫ్రంట్ తరపున పోటీ చేసి ఓడారు.