Rahul Gandhi : యువతి ఆత్మహత్య కాదు.. బీజేపీ హత్య - రాహుల్ గాంధీ

Update: 2025-07-15 12:45 GMT

ఒడిశా బాలేశ్వర్ లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఫకీర్ మోహన్ కాలేజీలో బీఈడీ సెకండియర్ విద్యార్థిని లెక్చరర్ వేధింపులు భరించలేక కాలేజీ ప్రాంగణంలో నిప్పంటించుకుంది. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ... ఇది ఆత్మహత్య కాదని, బీజేపీ చేసిన వ్యవస్థీకృత హత్య అని ఆరోపించారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు.

న్యాయం కోసం, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధిత విద్యార్థిని ధైర్యంగా పోరాడిందని రాహుల్ అన్నారు. ఆమెకు న్యాయం చేయడానికి బదులు.. అవమానించి, బెదిరించి, హింసించారని ఆరోపించారు. నిందితుడిని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. దేశంలో కుమార్తెలు ప్రాణాలు కోల్పోతున్నా.. మీరు ఇంకా మౌనంగానే ఉంటారా? అని మోడీని ప్రశ్నించారు. దేశానికి మీ మౌనం అవసరం లేదని... తమ ప్రశ్నలకు సమాధానాలు కావాలని అడిగారు.

కాగా విద్యార్థినిని లెక్చరర్ సమీర్ సాహు కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తనకు లొంగకపోతే భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయన వేధింపులు భరించలేని బాధితురాలు గత నెల 30న కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కాలేజీ యాజమాన్యం... ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో, తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు 12వ తేదీన కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయానికి ఒక్కసారిగా పరిగెత్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తోటి విద్యార్థులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. బాధితురాలిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయింది.

Tags:    

Similar News