Ola-Uber: ఫోన్లను బట్టి చార్జీలు వెయ్యలేదు - ఓలా, ఉబర్‌

అందరికీ ఒకే విధానం అమలు చేస్తున్నామన్న;

Update: 2025-01-25 04:15 GMT

దూరం ఒక్కటే అయినా వేర్వేరు ఫోన్ల ద్వారా రైడ్‌లు బుక్‌ చేసిన వినియోగదారులకు వేర్వేరు చార్జీలు విధిస్తున్నారని, ముఖ్యంగా ఐఫోన్‌ యూజర్లపై బాదుడు అధికంగా ఉందని వచ్చిన ఆరోపణలపై క్యాబ్‌ సేవల సంస్థలు ఉబర్‌, ఓలా శుక్రవారం స్పందించాయి. వినియోగదారులు వాడే ఫోన్లను బట్టి తాము చార్జీలను నిర్ణయించడం లేదని స్పష్టం చేశాయి. గమ్యస్థానం ఒకటే అయినప్పటికీ అది ఐఓఎస్‌ (ఐఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌) నుంచి బుక్‌ చేసిన వారికి ఒక రేటు, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి రైడ్‌ బుక్‌ చేసిన వారికి మరో చార్జీ వసూలు చేస్తున్నారని ఈ ప్రయాణ సేవల సంస్థలపై ఆరోపణలు వచ్చాయి.

ఈ స్పష్టమైన ధర వ్యత్యాసాన్ని ప్రశ్నిస్తూ వాటి ధర నిర్ణయం విధానాలను వివరించాలని, చార్జీల తేడా సమస్యను పరిష్కరించాలని కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) వీటికి నోటీసులు జారీ చేసింది. దీనిపై ఓలా అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘మేము కస్టమర్లకు చార్జీల నిర్ణయంలో ఏకీకృత విధానాన్ని అవలంబిస్తున్నాం. వారు వాడే సెల్‌ఫోన్లను బట్టి చార్జీలలో తేడా లేదు. అందరికీ ఒకే విధమైన చార్జీల విధానం అమలు చేస్తున్నాం’ అని తెలిపారు. ఇదే విషయాన్ని తాము ఈ రోజు సీసీపీఏకు తెలియజేశామని, ఈ విషయంలో ఏర్పడిన అపోహలను తొలగించడానికి సీసీపీఏతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. కాగా, దీనిపై వివరణ ఇవ్వాలని రాయిటర్స్‌ సంస్థ కోరగా, యాపిల్‌, గూగుల్‌ సంస్థలు ఇంకా స్పందించ లేదు.

Tags:    

Similar News