Maharashtra: అమానుషం..చనిపోయిన మహిళ చేతి బంగారు గాజులు చోరీ
వీడియో వైరల్, తిట్టిపోస్తున్న నెటిజన్లు;
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కుర్లాలో సోమవారం బస్సు ప్రమాదం జరిగింది. పలు వాహనాలు, పాదాచారులపైకి బెస్ట్ బస్సు దూసుకెళ్లింది. ఏడుగురు మరణించగా 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 55 ఏళ్ల కన్నిస్ అన్సారీ చనిపోయింది. అయితే కారు కింద చిక్కుకున్న మృతురాలి చేతికి ఉన్న బంగారు గాజులను ఒక వ్యక్తి చోరీ చేశాడు. ప్రమాద స్థలంలో గందరగోళం నెలకొనడంతో ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ప్రమాదానికి ముందు బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. హ్యాండిల్స్ పట్టుకుని బ్యాలెన్స్ కంట్రోల్ చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు, పాదాచారులను ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు ఆగింది. దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. కొందరు వ్యక్తులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకారు. బస్సులోని ప్రయాణికులంతా దిగిపోయారు.
మరోవైపు బస్ డ్రైవర్ సంజయ్ మోరే కూడా రెండు బ్యాగులతో బస్సు నుంచి కిందకు దిగాడు. గుమిగూడిన స్థానికులు అతడ్ని చుట్టుముట్టి కొట్టారు. అయితే లాయర్ అయిన వ్యక్తి ఆ బస్సు డ్రైవర్‌ను కాపాడాడు. మరోవైపు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.