Bhopal Theft: దొంగల ప్లాన్ అట్టర్ ఫ్లాప్.. రూ. 80 వేలు దోచుకుని రూ. 2 లక్షల బైక్ వదిలేసి పరార్!
పారిపోయే సమయంలో మొరాయించిన బైక్
భోపాల్‌లో జరిగిన ఓ దొంగతనం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది. దోపిడీకి వెళ్లిన దొంగలు తాము దోచుకున్న దానికంటే ఎన్నో రెట్లు విలువైన తమ బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. ఈ విచిత్ర ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
అయోధ్య నగర్ ప్రాంతానికి చెందిన నీరజ్ అనే కిరాణా వ్యాపారి గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన దుకాణం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో ఆయన వద్ద రూ. 80,000 నగదు ఉంది. ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలోకి రాగానే మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనను అడ్డగించి డబ్బు సంచిని లాక్కోవడానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో నీరజ్‌కు, దొంగలకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ గొడవలో నీరజ్ స్కూటర్ కిందపడిపోగా, ఆయన చేతిలోని డబ్బు సంచి జారిపోయింది. వెంటనే దొంగలు ఆ సంచిని తీసుకుని, తమ బైక్‌పై పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే, ఎంత ప్రయత్నించినా వారి బైక్ స్టార్ట్ కాలేదు. అదే సమయంలో, నీరజ్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి పరుగున రావడం మొదలుపెట్టారు.
జనం గుమిగూడటంతో భయపడిపోయిన దొంగలు తాము తెచ్చుకున్న సుమారు రూ. 2 లక్షల విలువైన బైక్‌ను అక్కడే వదిలేసి కాళ్లకు పనిచెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుల ముఠాను ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.