కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన సమాజంలోని ప్రతి మహిళపై జరిగిన దాడి అని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. ఇది లోతుగా పాతుకుపోయిన సమస్యలకు ప్రతిబింబమని చెప్పారు. ఆదివారం ఈ మేరకు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్‌కు ఆయన లేఖ రాశారు. సమాజంలో వ్యవస్థాగత మార్పులు, చర్యల తక్షణ అవసరాన్ని ఈ దుర్ఘటన గుర్తు చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. రోజులు గడుస్తున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైద్యులు రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారన్నారు. న్యాయం కోసం వైద్యులు చేసే పోరాటానికి తాను మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులకు కఠినంగా శిక్ష పడేలా బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు సమగ్ర చర్యలు చేపట్టాలని హర్భజన్ అన్నారు.