Encounter : ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం

Update: 2025-11-16 03:45 GMT

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో   ముగ్గురు మావోయిస్టులు  మరణించారు. చింతగుఫా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కరిగుండం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, గాలింపు బృందాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తున్నది. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

2026 నాటికి దేశంలో మావోయిస్టు అనే పేరు వినపడకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా చర్చలకు తావేలేదని తేల్చిచెప్పిన కేంద్రం.. మావోయిస్టులను వరుస ఎన్‌కౌంటర్లలో ఏరిపారేస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు సహా భారీగా క్యాడర్‌ ఆయుధాలతో సహా లొంగిపోయారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 262 మంది మావోయిస్టులు వివిధ ఎన్‌కౌంటర్లలో మృతిచెందారు. వారిలో 233 మంది ఒక్క బస్తర్‌ డివిజన్‌లో మరణించారు. మరో 27 మంది రాయ్‌పూర్‌ డివిజన్‌లోని గరియాబంద్‌ జిల్లాలో, ఇద్దరు దుర్గ్‌ డివిజన్‌లో చనిపోయారు.

Tags:    

Similar News