Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో నేడే రెండో విడత అసెంబ్లీ పోలింగ్..

6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ .;

Update: 2024-09-25 02:15 GMT

| జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ మొదలైంది. రెండో విడతలో భాగంగా పీర్‌పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రెండో విడత పోలింగ్ దశలో 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. వీటిలో 3 జిల్లాలు జమ్మూ డివిజన్‌లో, మరో 3 జిల్లాలు లోయలో ఉన్నాయి. ఈ దశలో ప్రముఖ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, JKPCC అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీంద్ర రైనా పోటీలలో ఉన్నారు. రెండో దశ ఎన్నికల్లో 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 25 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇందులో 1,056 పట్టణ ప్రాంతాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

ఐకపోతే తొలి దశలో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మూడో దశ, 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి శ్రీనగర్ జిల్లాలో 93 మంది, బుద్గామ్ జిల్లాలో 46 మంది, రాజౌరి జిల్లాలో 34 మంది, పూంచ్ జిల్లాలో 25 మంది, గందర్‌బల్ జిల్లాలో 21 మంది, రియాసి జిల్లాలో 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో రెండో దశలో చేర్చిన అనేక ప్రాంతాలు సున్నితమైనవి. ఈ దశలో ఉన్న కాశ్మీర్‌ లోని చాలా స్థానాల్లో వేర్పాటువాదుల ప్రభావం కనిపించింది. వీటిలో ఖన్యార్, జడిబాల్, లాల్ చౌక్, ఈద్గా, హజ్రత్‌బాల్ మొదలైనవి ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా దళాలను మోహరించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భద్రతపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈవీఎంల భద్రతపై ప్రత్యేక సూచనలు చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పారదర్శకంగా ఉండేలా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సౌకర్యాలు ఉంటాయని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News