Railway Trackman: విధి నిర్వహణ ట్రాక్ మ్యాన్ చొరవ, రైలుకు తప్పిన పెను ముప్పు

ఐదు నిమిషాల్లో అర కిలోమీటరు పరుగెత్తిన ట్రాక్ మ్యాన్;

Update: 2024-09-08 02:00 GMT

విధి నిర్వహణలో భాగంగా ఓ ట్రాక్‌మ్యాన్‌ చూపిన సమయస్ఫూర్తి, తెగువ.. రైలుకు పెను ప్రమాదాన్ని తప్పించింది. పట్టాలపై వెల్డింగ్ లోపాన్ని గుర్తించిన అతడు.. అదే మార్గంలో వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ఆపేందుకు పట్టాల వెంట అయిదు నిమిషాల్లో అర కిలోమీటరు మేర పరుగులు తీశాడు. 

అతను రైల్వే శాఖలో ఓ చిరుద్యోగి. కానీ అతను రాబోతున్న ఓ పెద్ద ప్రమాదాన్ని గుర్తించి అపగలిగాడు. వందలాది మంది ప్రయాణీకులు ప్రమాదం బారిన పడకుండా కాపాడాడు. విధి నిర్వహణలో అతను చూపిన సమయస్పూర్తి, తెగువను ఉన్నతాధికారులు గుర్తించడంతో పాటు నగదు పురస్కారంతో సత్కరించారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

రైల్వే ట్రాక్ మ్యాన్ మహాదేవ తన విధి నిర్వహణలో భాగంగా కొంకణ్ రైల్వే డివిజన్ లోని కుమ్టా, హోన్నావర్ స్టేషన్ మధ్య తనిఖీలు నిర్వహిస్తుండగా, వేకువజామున 4.50 గంటల ప్రాంతంలో ఓ ప్రదేశంలో రైలు పట్టాల జాయింట్ వద్ద వెల్డింగ్ అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించాడు. అప్పటికే ఆ మార్గంలో తిరువనంతపురం – ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ వస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన మహాదేవ .. ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదాన్ని కుమ్టా స్టేషన్ కు సమాచారం అందించాడు.

అయితే అప్పటికే రైలు ఆ స్టేషన్ ను దాటేసింది. దీంతో నేరుగా రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్ లోకో పైలట్ ను నేరుగా సంప్రదించేందుకు ప్రయత్నించగా, అదీ విఫలమైంది. దీంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మహదేవ ..ఆ రైలును ఆపేందుకు పట్టాల వెంట ఎదురుగా పరుగు తీశాడు. ఐదు నిమిషాల వ్యవధిలో అర కిలోమీటరు మేర పరిగెత్తి ..లోకో పైలట్ కు సిగ్నల్ ఇచ్చాడు. మహాదేవ ఇచ్చిన రెడ్ సిగ్నల్ తో లోకో పైలట్ రైలును నిలుపుదల చేశాడు.

అనంతరం రైల్వే ట్రాక్ పై వెల్డింగ్ పనులు పూర్తి అయిన తర్వాత రైలు తిరిగి గమ్యస్థానానికి బయలుదేరింది. వందలాది మంది రైల్వే ప్రయాణీకుల భద్రత కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధి నిర్వహణ చేసిన మహాదేవను రైల్వే ఉన్నతాధికారులు హీరోగా ప్రశంసించారు. అంతే కాకుండా మహాదేవను సత్కరించి రూ.15వేల నగదు పురస్కారాన్ని కూడా అందించారు.

Tags:    

Similar News