Cylinder Explosion: తమిళనాడులో ఘోర ప్రమాదం..సిలిండర్ పేలి నలుగురు మృతి..!
బెలూన్లకు గాలి నింపేందుకు ఉపయోగించిన హీలియం సిలిండర్ పేలుడు
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా మనలూర్పేట్టె ప్రాంతంలో నిర్వహిస్తున్న తెన్పెన్నయ్యారు నది ఉత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెలూన్లకు గాలి నింపేందుకు ఉపయోగిస్తున్న హీలియం సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో నలుగురు మృతి చెందారు. పేలుడు తీవ్రతకు వారి మృతదేహాలు చిద్రమయ్యాయి. అయితే అందిన సమాచారం మేరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ ప్రమాదంలో మరో 10 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఉత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, సందర్శకులు హాజరైన సమయంలో ఈ ఘటన జరగడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురైంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హీలియం వాయుతో నింపిన సిలిండర్‌ను వాహనంపై తీసుకువచ్చి బెలూన్లు విక్రయిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సిలిండర్ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో తెన్పెన్నయ్యారు నది ఉత్సవ వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది.