Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 150 అడుగుల లోతైన లోయలో పడ్డ కారు..

. ఎనిమిది మందిమృతి..!;

Update: 2025-07-16 02:15 GMT

ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరాగఢ్ జిల్లాలో మంగళవారం (జులై 15) సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న ఓ కార్ (టాక్సీ) అదుపు తప్పి సుమారు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం సోనీ వంతెన సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఈ టాక్సీలో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, గాయపడిన వారిని లోయలో నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత ప్రాథమిక చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాహనం అదుపు తప్పినదేనన్న అనుమానంతో విచారణ చేస్తున్నారు.

ఈ సంఘటన పిథోరాగఢ్ జిల్లా కేంద్రానికి 52 కిలోమీటర్ల దూరంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో చోటు చేసుకుంది. టాక్సీ లోయలో పడిపోయిన వెంటనే ఘటనా స్థలంలో పెద్దేత్తున్న కేకలు వినిపించాయని సమాచారం. దీనితో స్థానిక గ్రామస్తులు, పోలీసుల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ.. పిథోరాగఢ్ జిల్లాలోని మువానీ ప్రాంతంలో వాహనం ప్రమాదానికి గురైన వార్త చాలా బాధాకరం. ఈ ఘటనలో మరణించినవారికి నా ప్రగాఢ సంతాపం. వారి ఆత్మలు శాంతించాలి. వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందించేందుకు అధికారులను ఆదేశించాను అని తెలిపారు.

Tags:    

Similar News