PM Modi: ఈ విజయం చరిత్రాత్మకం: ప్రధాని మోదీ

నిజమైన విజేతలు ఢిల్లీ ప్రజలే;

Update: 2025-02-09 04:15 GMT

దేశ రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా గెలుపును చరిత్రాత్మక విజయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఎప్పటిలాగే ఆమ్‌ ఆద్మీ పార్టీని ‘ఆప్‌దా’ (ముప్పు)గా పేర్కొన్నారు. ఇప్పుడు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రెట్టించిన వేగంతో ఢిల్లీలో అభివృద్ధి సాధిస్తుందన్నారు.

ఢిల్లీని అభివృద్ధి చేస్తామని, ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు.. హస్తిన ప్రజలు ఇకపై ఆధునిక నగరాన్ని చూడబోతున్నారని చెప్పారు. అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తామన్నారు. బీజేపీ పథకాలు పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మోదీ గ్యారెంటీ అంటే తప్పకుండా పూర్తయ్యే గ్యారెంటీ అని అన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.

”పని తీరు ఆధారంగానే అనేక రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీకే అధికారం ఇస్తున్నారు. హర్యానాలో సుపరిపాలనకు నాంది పలికాము. మహారాష్ట్ర రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాము. బీహార్ లో నితీశ్ కుమార్ సైతం ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు. ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారు” అని మోదీ అన్నారు.

”ఢిల్లీలో ఇంతకాలం ప్రజలకు సేవ చేయనివ్వకుండా చేశారు. ఆందోళనలతో మెట్రో పనులు కదలనివ్వకుండా చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వనివ్వకుండా చేశారు. ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు ఢిల్లీ వాసులకు అందనివ్వలేదు. రాజకీయాల్లో షార్ట్ కట్ కి ప్లేస్ లేదు. షార్ట్ కట్ రాజకీయ నేతలకు జనం బుద్ధి చెప్పారు.

ఇక నుంచి ఢిల్లీలో బీజేపీ పాలన చూస్తారు. ఢిల్లీ అనేది దేశ రాజధాని మాత్రమే కాదు. ఇది మినీ హిందుస్తాన్. ఈ విజయం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తలదే. బీజేపీ కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు. ఢిల్లీకి అసలు ఓనర్ ఢిల్లీ ప్రజలే నని ఓటర్లు స్పష్టం చేశారు. ఢిల్లీకి ఓనర్ అవుదామనుకునే అహంభావులను తిప్పికొట్టారు” అని ప్రధాని మోదీ అన్నారు.

Tags:    

Similar News