Maha Kumbh Mela: మహా కుంభమేళాలో మరో ఘోరం
బస్సు-ట్రక్కు ఢీ.. ఏడుగురు భక్తులు మృతి
మహా కుంభమేళాలో మరో ఘోరం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి మినీ బస్సులో బయల్దేరిన భక్తులను ట్రక్కు రూపంలో మృత్యువు వెంటాడింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ దగ్గర బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు వదిలారు. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న జబల్పూర్ కలెక్టర్, ఎస్సీ సహా అధికారులంతా సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మొహ్లా-బార్గి సమీపంలో మంగవారం ఉదయం 9:15 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ బస్సు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినదిగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తులతో రహదారులన్నీ నిండిపోయాయి. తాజాగా జరిగిన ప్రమాదంతో ఎన్‌హెచ్-30పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అప్రమత్తమైన పోలీసులు క్లియర్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని చిత్రహత్ ప్రాంతంలో కూడా మరో ప్రమాదం జరిగింది. సహాయ్‌పూర్ గ్రామం సమీపంలో కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న కారు… ట్రక్కును ఢీకొట్టడంతో దంపతులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. మృతులు మహేంద్ర ప్రతాప్ (50), అతని భార్య భూరి దేవి (48) గా గుర్తించారు. ఇక సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు వెళ్తున్న కారు బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఒడిశాలోని రూర్కెలాకు చెందిన 34 ఏళ్ల శక్తిమ్ పూజారి మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.