Trump-China: టారిఫ్​ వార్​- చైనాపై అదనంగా 10% సుంకాలు పెంచిన ట్రంప్​

కెనడా, మెక్సికోకు లభించని ఊరట;

Update: 2025-03-04 05:15 GMT

 అమెరికా, చైనాల మధ్య టారిఫ్‌ వార్‌ కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాపై 10 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని 20 శాతానికి పెంచుతూ ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకాలు చేశారు. ఫెంటనిల్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చైనా విఫలమైందని, అందుకే 10 శాతంగా ఉన్న సంకాలను 20 శాతానికి పెంచుతునట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి.

అమెరికా నిర్ణయంతో బీజింగ్‌ కూడా ఇదే తరహాలో స్పందించే అకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అమెరికా వ్యవసాయ, ఆహార ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకోవచ్చని చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ న్యూస్‌పేపర్‌ వెల్లడించింది. కాగా, చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10 శాతం సుంకాలు విధిస్తూ ఫిబ్రవరి 2న ట్రంప్‌ ఆదేశాలు జారీచేశారు. ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 10 నుంచి 15 శాతం సుంకాలు విధించింది. గత నెల 11 నుంచే వాటిని అమలు చేస్తున్నది. ఇక మెక్సికో, కెనడాలపై కూడా అమెరికా 25 శాతం టారీఫ్ విధించింది. దీంతో అమెరికా దిగుమతులపై కూడా అంతే మొత్తంలో కెనడా సుంకాలు విధించారు.

కాగా, కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. పెంచిన సుంకాలు మార్చి 4 (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి యథావిధిగా అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 4 నుంచే ఇవి అమల్లోకి వస్తాయని గతంలో ప్రకటించినప్పటికీ ఇరు దేశాల అధ్యక్షుల విజ్ఞప్తి మేరకు దానిని నెల రోజుల పాటు వాయిదా వేశారు. ఆ గడువు నేటితో ముగియనుంది. దీంతో మెక్సికో, కెనడాపై సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్​ వెల్లడించారు.

Tags:    

Similar News