TVK Chief Vijay: కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే చీఫ్ విజయ్..
విజయ్ రూ.20 లక్షల సాయం
తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తన ప్రచార సభలో జరిగిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించి తన బాధ్యతను చాటుకున్నారు.
ఈ విషాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే ఘటనలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. తాను ప్రకటించిన ఈ మొత్తం వారి కుటుంబాల్లో వెలుగులు నింపలేదని, వారికి జరిగిన నష్టాన్ని పూడ్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు తాను, తన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని విజయ్ హామీ ఇచ్చారు. కాగా, శనివారం కరూర్ పట్టణంలో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీగా జనం తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.