Vijay: రాజీవ్ గాంధీ హంతకుడిపై యాక్టర్ విజయ్ ప్రశంసలు..
ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌పై నటుడు విజయ్ ప్రశంసలు..
తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో ఉన్న తమిళ సమస్యల్ని లెవనెత్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) దివంగత చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన, ప్రభాకరన్‌పై ప్రశంసించడం సంచలనంగా మారింది. దేశ ప్రజలు శ్రీలంక తమిళుల గొంతుక కావాలని పిలుపునిచ్చారు.
తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా, నాగపట్నంలో జరిగిన కార్యక్రమంలో విజయ్ శ్రీలంక తమిళులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభాకరన్ సమాజానికి ‘‘తల్లి లాంటి వారు’’ అని అన్నారు. శ్రీలంక తమిళుల సమస్య తమిళనాడులో, ముఖ్యంగా నాగపట్నం ప్రాంతంలో భావోద్వేగాలతో కూడి ఉంటుంది. ‘‘తమిళ ప్రజలకు శ్రీలంక తమిళులు సోదరులు అని, ఈలం తమిళులు వారు శ్రీలంకలో ఉన్నా లేదా ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నా, తమపై మాతృ ప్రేమను చూపించిన నాయకుడిని కోల్పోయిన తర్వాత బాధపడుతున్నారు’’ అని ప్రభాకరన్ గురించి విజయ్ అన్నారు. వారి కోసం మాట్లాడటం మన కర్తవ్యం అని చెప్పారు. విజయ్ శ్రీలంక తమిళుల కోసం మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2008లో శ్రీలంక తమిళుల హత్యకు నిరసనగా చెన్నైలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
రెండు దశాబ్ధాల పాటు శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో ఎల్టీటీఈ సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. 1990లో భారత్ ఎల్టీటీఈని నిషేధించింది. శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఈ సంస్థ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. 2009లో శ్రీలంక సైన్యానికి, ఎల్టీటీఈకి జరిగిన భీకర పోరాటంలో ప్రభాకరన్ మరణించాడు. అప్పటి నుంచి శ్రీలంకలో ఈ వేర్పాటువాద ఉద్యమం అంతమైంది. ఎల్టీటీఈతో పోరాడేందుకు రాజీవ్ గాంధీ భారత సైన్యాన్ని పంపారనే కోపంతో 1991లో ప్రభాకరన్, ఎల్టీటీఈ నిఘా చీఫ్ పొట్టు అమ్మన్ రాజీవ్ గాంధీ హత్యకు పథకం వేశారు. 1991లో చెన్నై సమీపంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో శ్రీలంక తమిళ మహిళా ఆత్మాహుతి బాంబర్ శ్రీ గాంధీని పేల్చివేసింది.