Vijay: రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించిన విజయ్..
బీజేపీ, డీఎంకేలను వదిలిపెట్టం అంటూ దళపతి విజయ్ వార్నింగ్..
‘వన్ నేషన్, వన్ పోల్(జమిలీ ఎన్నికలు)’ అంటే ‘ప్రజాస్వామ్యం హత్య’ అని నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మండిపడ్డారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ యాత్రను ఆయన శనివారం ప్రారంభించారు. అరియలూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను విమర్శించారు.
తమిళనాడు వంటి దక్షిణాది రాష్ర్టాల్లోని ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసిందన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, నియోజకవర్గాల పునర్విభజన దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న ద్రోహానికి మరో రూపమని ఆరోపించారు. బీజేపీ ఎంతో దుర్మార్గమైనదని, బీహార్‌లో 60 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని చెప్పారు.
తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ శనివారం తన రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి తన తొలి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో డీఎంకేలు రెండూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. వారు ఇచ్చిన హామీలు విఫలమయ్యాయని అన్నారు. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు దేవాలయాల్లో ప్రార్థనలు చేసినట్లుగా, 2026 ప్రజాస్వామ్య యుద్ధానికి సిద్ధమయ్యే ముందు ప్రజలను కలవడానికి వచ్చానని విజయ్ అన్నారు. తాను తమిళ ప్రజల గొంతుక అని చెప్పారు.
బీజేపీ, డీఎంకే పార్టీలను విడిచిపెట్టబోమని, ప్రజలను హించే బీజేపీని, వారిని మోసం చేసే డీఎంకేను మేము వదిలిపెట్టమని చెప్పారు. ఒకే దేశం, ఒకే ఎన్నికల కోసం బీజేపీ ఒత్తిడి చేయడాన్ని విజయ్ తూర్పారపట్టారు. దీనికి ఎన్నికల తారుమారు కోసం ఒక పథకం అని ఆరోపించారు. దక్షిణ భారతదేశ రాజకీయాల బలాన్ని తగ్గించే భారీ కుట్రగా ఆయన అభివర్ణించారు.
తమిళనాడు విద్యార్థులకు కేంద్రం నిధులు నిరాకరిస్తోందని, తమిళ ద్విభాషా విధానానికి వ్యతిరేకంగా హిందీ, సంస్కృతాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తోందని, కీజాది తవ్వకాల ఫలితాలను నీరుగార్చాలని పురావస్తు శాస్త్రవేత్తలపై ఒత్తిడి తెస్తోందని ఆయన ఆరోపించారు. విపత్తు సహాయ నిధులను సరిగ్గా విడుదల చేయడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని, శ్రీలంక నావికాదళం తమిళ జాలరులపై దాడులను పట్టించుకోలేదని, నీట్ వైద్య పరీక్ష వివాదం వల్ల కలిగే బాధను విస్మరించిందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ద్రోహాలకు ఇవి కొన్ని నమూనాలు మాత్రమే అని అన్నారు. బీజేపీ తమిళనాడును మోసం చేస్తే, డీఎంకే తన సొంత ప్రజల్ని హామీల పేరుతో మోసగించిందని ఆరోపించారు.