UP Election 2022: ఎన్నికల వేళ యూపీ బీజేపీలో కీలక మార్పులు.. వరుసగా ఇద్దరు మంత్రుల రాజీనామా..
UP Election 2022: యూపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీజేపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి.;
UP Election 2022: యూపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీజేపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఎస్పీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మంగళవారం ఓ మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి 24 గంటలైనా గడవక ముందే.. మరో మంత్రి ఝలక్ ఇచ్చారు. యోగి క్యాబినెట్ మంత్రి దారా సింగ్ చౌహన్ రాజీనామా చేశారు. దళితుల ఓట్లతోనే గద్దెనెక్కిన యోగి సర్కారు..వారిని కనీసం పట్టించుకోలేదన్నారు.
నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు దారాసింగ్. అటు మరోమంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. దళితులు, వెనుకబడిన తరగతులు, రైతులు, నిరుద్యోగ యువతపై యోగి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నందుకే రాజీనామా చేసినట్టు ప్రకటించారు.
అయితే.. ఆయన రాజీనామా చేసిన 24 గంటల్లోనే.. అరెస్ట్ వారంట్ జారీ అయింది. 2014లో చేసిన విద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించి సుల్తాన్ పూర్ ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. యూపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.రాజీనామాలు శాంపిల్ మాత్రమే అనే టాక్ వినిపిస్తోంది.
పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీని వీడెందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఓబీసీ ముఖ్య నేతల వలసలతో ఖంగుతిన్న బీజేపీ నాయకత్వం.. తిరుగుబాటుదారులను బుజ్జగించే బాధ్యతను డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు అప్పగించింది. అటు యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ జరగనుండగా.. మార్చి 7న చివరి, ఏడో దశ పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.