New Election Commissioners: నూతన ఎన్నికల కమిషనర్లుగా ఎంపికైన సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్
అధికారికంగా బాధ్యలు స్వీకరణ;
కేంద్ర ఎన్నికల కమిషనర్లు గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్‌బీర్ సింగ్ సంధూ , జ్ఞానేశ్ కుమార్ నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా వీరు ఈసీఐలో చేరారు. కమిషనర్లుగా శుక్రవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
కాగా ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టుల భర్తీకి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం సమావేశమైంది. ఈ క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడకముందే, కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరీ వారి పేర్లను బయటపెట్టారు. ఎలక్షన్ కమిషనర్లుగా మాజీ అధికారులు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. వీరి నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ ప్రతిపాదిత పేర్లతో ఓ జాబితాను రూపొందించింది. గురువారం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించి ఫైనల్ లిస్టును రూపొందించారు.
ఇక కొత్త కమిషనర్ ల విషయానికి వస్తే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ చీఫ్ కమిషనర్‌గా ఉన్నారు. కమిషనర్‌గా ఉన్న అనూప్ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేయగా.. మరో కమిషనర్ అరుణ్ గోయెల్ ఇటీవలే అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త కమిషనర్ల నియామకం అనివార్యమైంది. గురువారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కమిటీ కొత్త కమిషనర్లుగా సుఖ్‌బీర్ సింగ్ సింధూ, జ్ఞానేశ్ కుమార్‌లను ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా వీరు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు.
కేరళకు చెందిన కుమార్, ఉత్తరాఖండ్‌కు చెందిన సంధూ ఇద్దరూ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంలో కుమార్ హోంమంత్రిత్వ శాఖలో సేవలు అందించగా, సంధూ గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా వ్య వహరించారు. కాగా, ఎన్నికల కమిషనర్ల ప్రకియపై ఎంపిక కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరీ అసంతృప్తి వ్యక్తం చేశారు.