Jyoti Malhotra: గూఢచారి జ్యోతి మల్హోత్రాకు స్పాన్సర్ చేసిన పాక్-లింక్డ్ సంస్థ..
అదే సంస్థతో అజర్ బైజాన్ ఒప్పందం..;
పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ దేశంలో సంచలనంగా మారింది. ఆమెకు పాకిస్తాన్‌పై ఉన్న ప్రేమ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. మూడుసార్లు పాకిస్తాన్ సందర్శించి ఆమె, పలువురు పాక్ ఏజెంట్లను కలుసుకున్నట్లు తేలింది. ఇదే కాకుండా, ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి డానిష్‌తో ఆమెకు ఉన్న పరిచయం వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా, పాకిస్తాన్ తరుపున ఒక కథనాన్ని ప్రచారం చేయడానికి ఆమె తన వీడియోలను వాడుకున్నట్లుగా విచారణలో వెల్లడైంది. 33 ఏళ్ల యూట్యూబర్ ప్రస్తుతం హర్యానా పోలీస్ కస్టడీలో ఉన్నారు. గత రెండు వారాల్లో ఈమెతో పాటు 11 మంది పాకిస్తాన్ గూఢచారులు అరెస్ట్ చేయబడ్డారు.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌లో పనిచేస్తున్న యూఏఈకి చెందిన ట్రావెల్ కంపెనీ వీగోతో జ్యోతి మల్హోత్రా సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా తరుచుగా చేసే ప్రయాణాలకు వీగోనే స్పాన్సర్ చేసినట్లు తేలింది. అయితే, ఈ సంస్థ ఇప్పుడు అజర్ బైజాన్‌తో రెండు రోజుల క్రితం కీలక ఒప్పందం చేసుకుంది. అజర్ బైజాన్ టూరిజం బోర్డుతో వీగో ఒప్పందం చేసుకున్నట్లు తేలింది.
ఇటీవల భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగాలతో పాటు పీఓకేలోని పలు ఉగ్రవాద స్థావరాలపై ‘‘ఆపరేషన్ సిందూర్’’పేరుతో దాడులు చేసింది. అయితే, ఈ దాడుల్ని అజర్ బైజాన్ బహిరంగంగా ఖండించింది. పాక్ అమాయక పౌరులపై భారత్ దాడులు చేస్తుందని ఆరోపించింది. భారత్‌కి వ్యతిరేకంగా టర్కీతో పాటు అజర్ బైజార్ పాకిస్తాన్ వైపు నిలబడ్డాయి.
గూఢచర్యం కింద అరెస్టయిన జ్యోతి మల్హోత్రాకు ఈ సంస్థకు సంబంధం ఉండటం, ఇదే సంస్థ అజర్ బైజార్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. పాకిస్తాన్ గూఢచర్యం, నిధులతో వీగోకు సంబంధాలు ఉన్నట్లు ప్రత్యక్ష ఆధారాలు లేనప్పటికీ, ఈ కేసు సందర్భంగా దేశంలో దీని కార్యకలాపాలపై ఆందోళన నెలకొంది. వీగో ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. దుబాయ్, బెంగళూర్, జకర్తాలో దీని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో టూరిస్టులకు, వినియోగదారులకు విమాన సంస్థలు, హోటళ్లు, ఆన్ లైన్ ట్రావెల్ ఎజెన్సీలలో ధరల్ని పోల్చడంలో సహాయపడేందుకు రూపొందించిన ట్రావెల్ మెటాసెర్చ్ ఇంజన్.