Udhayanidhi Stalin : సనాతన ధర్మాన్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తా
మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్;
సనాతన ధర్మంపై తన వైఖరిని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి సమర్ధించుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్, పీకే శేఖర్‌బాబుపై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు మద్రాస్ హైకోర్టు పోలీసులను విమర్శించిన అనంతరం స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూలతో పోల్చుతూతమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. బీజేపీ లాంటి రైట్ వింగ్ పార్టీలు సంస్థలే కాకుండా డీఎంకేతో మితృత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు కూడా స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టాయి. అంతేకాదు ఉదయ నిథి తల తెచ్చిస్తే రూ.10కోట్లు నజరానా ఇస్తానంటూ తపస్విచావిని ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస ఆచార్య చేసిన ప్రకటన సంచలనం కలిగించింది. ఇలా ఉదయనిధిపై ఘాటు విమర్శలు, హెచ్చరికలు పెద్ద ఎత్తున వచ్చాయి.
దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఓ సందర్భంలో స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినవారికి గట్టి సమాధానం ఇవ్వాలంటూ సూచించారు. కానీ ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదంటూ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేసిన ఉదయనిధి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ కాంట్రవర్సీలోకి లాగారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభించలేదని.. ఆమె వితంతువు, గిరిజనురాలైనందున కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఆయన అన్నారు.
కొద్ది రోజుల చర్చ తరువాత ఇది కాస్త చల్లబడింది. ఇప్పుడు తాజాగా ఈ కాంట్రవర్సీని మరోసారి చర్చలోకి తెచ్చారు ఉదయనిధి. తాను సనాతన ధర్మాన్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని సోమవారం అన్నారు. ‘‘నేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన ప్రతి మాట సత్యం. దీన్ని నేను చట్టపరంగా కూడా ఎదుర్కొంటాను. నా వ్యాఖ్యల్లో ఒక మాటను కూడా మార్చే ప్రసక్తే లేదు. నేను నా భావజాలాన్ని చెప్పాను. అంబేద్కర్, పెరియార్, తిరుమావలన్ చెప్పిన దాని కంటే నేనేమీ ఎక్కువ చెప్పలేదు. ఈరోజు నేను ఎమ్మెల్యే, మంత్రిని కావొచ్చు. రేపు కాకపోవచ్చు. కానీ మనిషిగా ఉండడం చాలా అవసరం’’ అని అన్నారు.