Cheating : పెళ్లి పేరుతో కోటి కొట్టేసింది
మ్యాట్రీమోనీలో పరిచయం..పెళ్లి పేరుతో మోసం;
పెళ్లి అంటే ఒకప్పుడు చాలా హడావుడి. కుటుంబంలో నలుగురికి చెప్పి తెలిసిన బంధువుల ద్వారా సంబంధం వెతుక్కొని, మంచి చెడ్డ చూసుకుని ముందుకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అందరం బిజీ అయిపోయాం. ఒకరితో ఒకరు మాట్లాడుకునే టైమే లేదు. అందుకే పెళ్ళి విషయంలో మ్యాట్రిమోనీ సైట్లపై ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందులో మన వివరాలు పెట్టేసి ఎదుటివారి వివరాలు చూసుకొని నచ్చితే డైరెక్ట్ గా మాట్లాడకుండా సంబంధాలు ఫిక్స్ చేసుకుంటున్నాము.కానీ ఈ మధ్య ఇలాంటి సైట్లలో స్కామ్‌లు కూడా ఎక్కువవుతున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్ముంచి డబ్బులు కాజేస్తున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ యువతి మ్యాట్రిమోనీ సైట్‌లో భారీ మోసానికే పాల్పడింది. ఓ వ్యక్తిని బెదిరించి అతడి నుంచి ఏకంగా కోటీ రూపాయలకు పైగా వసూలు చేసింది.
వివరాల్లోకి వెళితే..
బెంగళూరులోని ఆర్‌కేపురం అనే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి యూకేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల శిక్షణ కోసమని బెంగళూరుకు వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళదామని నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం మ్యాట్రిమోనీ సైట్‌లో తన తన వివరాలు నమోదు చేసుకున్నాడు. అదే వెబ్సైట్లో ఓ యువతి తో అతనికి పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రక్రియలో వాళ్లిద్దరు తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన తండ్రి చనిపోయాడని, ప్రస్తుతం తల్లితోనే ఉంటున్నానని యువతి అతడికి చెప్పింది. అతను కూడా ఆ విషయం నమ్మి తల్లి ఆరోగ్యం బాగాలేదని.. హాస్పిటల్‌కు వెళ్లేందుకు డబ్బులు అడగగానే పంపించాడు. రెండు రోజుల తర్వాత ఆమె అతడికి న్యూడ్ వీడియో కాల్ చేసి మాట్లాడింది. అతనికి తెలియకుండానే ఆ వీడియోను అంతా రికార్డు చేసి ఆ వీడియో క్లిప్‌ను అతనికి షేర్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకపోతే మీ తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరింపులు మొదలు పెట్టింది.
అలా బెదిరిస్తూ దాదాపు కోటీ రూపాయలకు పైగా కాజేసింది. ఇక వేధింపులు భరించలేక అతడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను గుర్తించి వాటిని నిలిపివేశారు. అలాగే 84 లక్షల రూపాయలు బ్లాక్ చేశారు. ఇప్పటి దాకా ఆమె రూ.30 లక్షలు వాడినట్టుగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.