Budget 2026 : కేంద్ర బడ్జెట్ వేళలో మార్పు? ఆదివారం అడ్డంకి.. నిర్మలమ్మ లెక్కలు ఎప్పుడు వస్తాయో.
Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026-27 ఎప్పుడు వస్తుందనే దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. సాధారణంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మనకు అలవాటు. అయితే, వచ్చే ఏడాది అంటే 2026 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వచ్చింది. ఆదివారం అంటే ప్రభుత్వ కార్యాలయాలకు, స్టాక్ మార్కెట్‌కు సెలవు దినం. పైగా ఆ రోజు సంత్ రవిదాస్ జయంతి కూడా ఉంది. దీంతో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ఆదివారమే చదువుతారా లేక తేదీ మారుతుందా అనే సస్పెన్స్ నెలకొంది.
గతంలో శనివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి. 2025లో కూడా ఫిబ్రవరి 1 శనివారం వచ్చినప్పటికీ, ప్రభుత్వం అదే రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కానీ ఆదివారం రోజున బడ్జెట్ రావడం అనేది చాలా అరుదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను ఒక రోజు ముందుగా అంటే జనవరి 31 (శనివారం)న ప్రవేశపెడతారా? లేక ఒక రోజు ఆలస్యంగా ఫిబ్రవరి 2 (సోమవారం)న తీసుకొస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై తుది నిర్ణయం పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తీసుకోవాల్సి ఉంది.
భారత బడ్జెట్ చరిత్రను గమనిస్తే 2017కు ముందు ఫిబ్రవరి చివరి పని దినాన బడ్జెట్ వచ్చేది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సంప్రదాయాన్ని మార్చి ఫిబ్రవరి 1కి తీసుకొచ్చారు. బడ్జెట్ ప్రక్రియ ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే నాటికి పూర్తి కావాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. అప్పటి నుండి శనివారాలు వచ్చినా బడ్జెట్ ఆగలేదు. 2015, 2016, 2021, 2025 సంవత్సరాల్లో శనివారం రోజే బడ్జెట్ ప్రసంగాలు జరిగాయి. కానీ ఆదివారం విషయంలో మాత్రం ప్రభుత్వం డైలమాలో ఉంది.
స్టాక్ మార్కెట్ నిపుణులు, ఆర్థికవేత్తలు మాత్రం బడ్జెట్‌ను ఫిబ్రవరి 2 (సోమవారం) న ప్రవేశపెట్టే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ ప్రకటనల ప్రభావం వెంటనే మార్కెట్‌పై ఉంటుంది కాబట్టి, పని దినాల్లో అయితేనే బాగుంటుందని వారి అభిప్రాయం. మరి కేంద్ర ప్రభుత్వం సెంటిమెంట్‌ను ఫాలో అయ్యి ఆదివారమే బడ్జెట్ ఇస్తుందో లేక సోమవారానికి మారుస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.